కమలంలో పాత-కొత్త పంచాయితీ..గ్రూపులతో నష్టమే.!

తెలంగాణ బీజేపీలో అంతర్గత పోరు పైకి కనిపించడం లేదు గాని..లోలోపల మాత్రం పెద్ద రచ్చ జరుగుతుంది. మొన్నటివరకు కాంగ్రెస్ పార్టీలో రచ్చ జరుగుతూనే వస్తుంది..ఇప్పటికీ ఆ పార్టీలో పోరు ఉంటూనే ఉంటుంది. కాకపోతే ఆ పోరు బహిరంగంగా కనబడుతుంది. కానీ కమలం పార్టీలో మాత్రం అది పెద్దగా కనిపించడం లేదు.

అయితే ఇక్కడ కూడా ఆధిపత్య పోరు నడుస్తుందనే చెప్పాలి. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు అయిన దగ్గర నుంచి సీనియర్లతో పెద్దగా పొసగడం లేదనే సంగతి తెలిసిందే. పైగా బండి దూకుడుగా రాజకీయం చేయడం, సీనియర్లకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదనే కథనాలు వస్తున్నాయి. ఇదే సమయంలో బి‌జే‌పి భావజాలంకు కాస్త దూరంగా ఉండే ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి లాంటి వారు..బి‌జే‌పిలోకి వచ్చాక సీన్ మారింది. అక్కడ నుంచి పాత, కొత్త నేతల మధ్య పంచాయితీ నడుస్తూ వస్తుంది. ముఖ్యంగా ఈటల, బండి మధ్య పోరు  తారస్థాయిలో ఉందని తెలుస్తోంది.

ఢిల్లీకి బండి సంజయ్, ఈటల... అమిత్ షాతో భేటీకానున్న నేతలు!

ఇటీవల ఈటల తన టీంని తీసుకెళ్లి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణరావులతో భేటీ అయ్యారు. వారిని బి‌జే‌పిలోకి ఆహ్వానించారు. కానీ ఆ విషయం తనకు తెలియదని బండి చెప్పుకొచ్చారు. పైగా ఇటీవల సర్వేల  ఆధారంగానే సీట్లు ఇస్తామని, రికమండేషన్, లాబీయింగ్‌లు పనిచేయవని..పరోక్షంగా ఈటల వర్గానికి షాక్ ఇచ్చేలా ప్రకటన ఇచ్చారు.

ఇక తాజాగా ఈటల దానికి కౌంటర్ ప్రకటన చేశారు. బి‌జే‌పి అధ్యక్షుడుగా బండి కొనసాగుతారని చెబుతూనే.. తనని ఎలా వాడుకోవాలో అధిష్టానం ఆలోచిస్తుందని,  పార్టీలో ఉన్న పాత వారికి, ఇతర పార్టీల నుంచి వచ్చిన కొత్త వారికి ఘర్షణ వాతావరణం ఉండడం సహజమని చెప్పుకొచ్చారు.  పాత, కొత్త అని బేదం ఉండకూడదని అధిష్టానమే చెబుతోందని,  ప్రజా క్షేత్రం లో పేరున్న వారికే టికెట్లు వస్తాయని అన్నారు. దీని బట్టి చూస్తే పార్టీలో పాత, కొత్త నేతల మధ్య పంచాయితీ మాత్రం నడుస్తుందని చెప్పవచ్చు.