కమలంలో సీనియర్లకు కఠిన పరీక్ష.!

-

తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతున్న తరుణంలో బిజెపి అధిష్టానం రాష్ట్రంలోని బిజెపి సీనియర్లందరికీ షాక్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఇప్పటివరకు ఉన్న సీనియర్లందరూ ఎమ్మెల్యేలుగా తమను నిరూపించుకొని, నియోజకవర్గాల్లో గట్టిపట్టు సాధించారు. ఎంపీలుగా గెలిచి తమ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఇప్పుడు వారు ఎంపీలుగా ఉండి ఎమ్మెల్యేలుగా కొత్తవారిని నిలబెట్టి తమ పలుకుబడితో వారిని గెలిపించాలి అని అందరూ ఆలోచనలో ఉంటే, ఇందుకు విరుద్ధంగా బిజెపి సీనియర్లంతా పోటీ చేయాల్సిందే, ఖచ్చితంగా ప్రతి స్థానంలోనూ డిపాజిట్ పొందాల్సిందే అని మెత్తగా చెబుతూనే గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారట.

బెంగాల్లో సీనియర్లను నిలబెట్టి వారి ద్వారా టి‌ఎం‌సికి గట్టి పోటీ ఇచ్చారు. ఇప్పుడు అదే ఫార్ములాని తెలంగాణలో ప్రవేశపెట్టి విజయం సాధించాలని చూస్తోంది. కర్ణాటక పరాజయం నుండి బయటకు రావడానికి తెలంగాణ ఎన్నికలను తనకు అనుకూలంగా మార్చుకోవాలని బిజెపి చూస్తోంది.

తెలంగాణలో హంగ్ ఏర్పడితే బీజేపీ కచ్చితంగా అధికారం చేపడుతుందని బిజెపి సీనియర్ నేత బీ ఎల్ సంతోష్ అన్నారు. సీనియర్లంతా పోటీ చేయాలి అని చెప్పటమే కాకుండా, ఎవరెవరు ఎక్కడ పోటీ చేసి తమ బలాబలాలను నిరూపించుకోవాలో కూడా ప్రకటించారట. బిజెపి సీనియర్లు ఎవరెవరు ఎక్కడెక్కడ నుంచి పోటీ చేయాలంటే… అంబర్ పేట నుంచి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, కోరుట్ల లేదా ఆర్మూర్ నుంచి అరవింద్, గద్వాల నుండి డీకే అరుణ, మునుగోడు నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మెదక్ నుండి విజయశాంతి, దుబ్బాక నుండి రఘునందన్ రావు, హుజూరాబాద్ నుండి ఈటెల, ముషీరాబాద్ నుండి లక్ష్మణ్ ఇలా సీనియరంతా పోటీ చేసి తమ స్థానాలు  గెలిచి తమ బలాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది అని బిజేపీ అధిష్టానం ప్రకటించింది.

కానీ రాష్ట్రంలోని సీనియర్లు ఎవరు అసెంబ్లీకి పోటీ చేయడానికి సుముఖత చూపించటం లేదని సన్నిహిత వర్గాలు అంటున్నారు. ముందుగా అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి ఓటమి పొంది, పార్లమెంట్ బరిలో దిగితే ప్రతిపక్షాల ముందు చులకన అయిపోతామని సీనియర్లంతా భావిస్తున్నారు. ఉన్న నాలుకకు మందేస్తే కొండనాలిక ఊడిన చందంగా అసెంబ్లీలో గెలుపు లక్ష్యంగా బరిలో దిగితే పార్లమెంటుకు పోటీ చేసే స్థితి కూడా ఉండదేమోనని బిజెపి సీనియర్లు అంటున్నారు. మరి బిజెపి వ్యూహం ఫలించి ఈసారి తెలంగాణలో కాషాయ జెండా ఎగురుతుందా వేచి చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version