TV9 రవిప్రకాశ్‌కు ఉద్వాసన?

-

టీవీ చానల్ నిర్వహణ తన ఇష్టారాజ్యంగా జరగాలన్న పంతంతో కొత్త యాజమాన్యానికి అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తూ, చివరకి ఓ కీలక ఉద్యోగి సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసే స్థాయికి దిగజారిన Tv9 సీఈవో రవిప్రకాశ్‌ను ఆ సంస్థ సీఈవో పదవి నుంచి తొలగించాలని Tv9 యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.

కంపెనీలో 90 శాతానికి పైగా వాటా ఉన్న కొత్త యాజమాన్యానికి ఆ కంపెనీ నిర్వహణలో అడుగడుగునా అడ్డుపడుతూ, కంపెనీల చట్టంలోని నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని కొత్త యాజమాన్యం ఆరోపించింది. మెజార్టీ వాటాదారుల హక్కులను అణగదొక్కే విధంగా కుట్రపూరిత చర్యలకు పాల్పడ్డారంటోంది అలందా మీడియా. సంస్థ నిర్వహణకు సంబంధించి రవిప్రకాశ్ పాల్పడిన అక్రమాలపై Tv9 యాజమాన్యం అతనిపై చీటింగ్ కేసు కూడా పెట్టింది. సంస్థకు హాని కలిగించే ఉద్దేశంతో కొందరు వ్యక్తులతో కుమ్మక్కై ఫోర్జరీ పత్రాలు సృష్టించడమే కాక, కంపెనీ నిర్వహణలో యాజమాన్యానికి ఇబ్బందులు కలిగించే రీతిలో వ్యవహరిస్తున్నారని Tv9 యాజమాన్యం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో స్పందించిన పోలీసులు, ఆఫీసులోని రవిప్రకాశ్‌ చాంబర్‌ను సీజ్‌ చేసి, అయనకు ప్రవేశ అనుమతి లేకుండా చేసారు. ప్రస్తుతం రవిప్రకాశ్‌ అందుబాటులో లేరని, బహుశా విదేశాల్లో ఉన్నాడేమోనని యాజమాన్యం అనుమానం వ్యక్తం చేస్తోంది.

ఈ కేసు వివరాల్లోకి వెళితే.. టీవీ9 పేరుతో తెలుగు, మరాఠీ, కన్నడ, గుజరాతీ, ఇంగ్లీషు, హిందీ ఛానళ్లు నిర్వహిస్తున్న అసోసియేటెడ్‌బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ (ABCL)ను వ్యాపారవేత్త శ్రీనిరాజుకు చెందిన చింతలపాటి హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ , ఐల్యాబ్స్ వెంచర్ కేపిటల్ ఫండ్ కలిపి ప్రారంభించాయి. ABCL కంపెనీలో ఈ రెండు సంస్థలకు కలిపి 90 శాతానికి పైగా వాటా ఉండగా, ఆ సంస్థలో ఓ ఉద్యోగిగా చేరి సీఈవో, డైరెక్టర్‌గా హోదా పొందిన రవిప్రకాశ్, ఆయన అసోసియేట్స్‌కు సంస్థలో దాదాపు 8 శాతం వాటా ఉంది.


ABCLలో 90 శాతానిపైగా వాటా ఉన్న రెండు సంస్థల నుంచి ఆ వాటాను కొనుగోలు చేసేందుకు హైదరాబాద్‌కు చెందిన అలందా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ప్రైవేట్ లిమిటెడ్ ఆగస్టు 23, 2018న ఒప్పందం కుదుర్చుకుని ఆగస్టు (24) 25న డబ్బు కూడా చెల్లించింది. దీనికి అనుగుణంగానే ఆ షేర్లు మొత్తం కూడా అలందా మీడియా పేరు మీద ఆగస్టు 27వ తేదీన డి-మ్యాట్ రూపంలో బదిలీ కూడా జరిగింది. దీంతో ABCL యాజమాన్యం అలందా చేతికి మారినట్లయ్యింది. ఈ లావాదేవీని గుర్తిస్తూ, ABCL కంపెనీ తన రికార్డుల్లో నమోదు కూడా చేసుకుంది. సంబంధిత పత్రాలను రిజిస్ట్రార్ ఆఫ్‌కంపెనీస్‌కార్యాలయంలో దాఖలు కూడా చేశారు. ABCL యాజమాన్యం చేతులు మారడంతో అలందా మీడియా సంస్థ తరపున నలుగురు డైరెక్టర్లను ABCL డైరెక్టర్ల బోర్డులో నియమించేందుకు కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ అనుమతి కోరుతూ ABCL సంస్థ అక్టోబర్ 23, 2018న ఓసారి, జనవరి 30, 2019న మరోసారి డైరెక్టర్ల బోర్డు మీటింగ్‌లో తీర్మానాన్ని ఆమోదించి, ఆ తీర్మానాన్ని ABCL సంస్థ కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖకు అధికారికంగా పంపించింది. ఈ తీర్మానాల మీద ఒకసారి వి.రవిప్రకాశ్, మరోసారి ఎం.కె.వీ.ఎన్ మూర్తి అనే మరో డైరెక్టర్ ABCL డైరెక్టర్ల హోదాలో సంతకాలు చేశారు. ఈ దరఖాస్తును పరిశీలించిన కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ మార్చి 29, 2019న అనుమతి మంజూరు చేస్తూ ABCLకు సమాచారం పంపింది. అన్ని అనుమతులు ఉన్నప్పటికీ, కొత్త డైరెక్టర్లతో బోర్డు మీటింగ్ నిర్వహించేందుకు రవిప్రకాశ్ శతవిధాలా అడ్డుపడుతూ వచ్చారు. దీంతో ABCLలో 90 శాతానికి పైగా వాటా పొందిన అలందా మీడియాకు చెందిన నలుగురు డైరెక్టర్లు ఏప్రిల్ 23, 2019న సమావేశమై తమ నియామకానికి చెందిన పత్రాలను రిజిస్ట్రార్‌ఆఫ్‌కంపెనీస్‌కార్యాలయంలో దాఖలు చేయాల్సిందిగా ఈ బాధ్యతలు నిర్వహిస్తున్న కంపెనీ సెక్రటరీని కోరారు.


రవిప్రకాశ్, ఆయన సహచరులు కొందరు దీన్ని అడ్డుకునే దురుద్దేశంతో, ఆ కంపెనీ సెక్రటరీ రాజీనామా చేసినట్లు పాతతేదీతో ఫోర్జరీ డాక్యుమెంట్‌ను సృష్టించారు. ఇదే విషయాన్ని సదరు కంపెనీ సెక్రటరీ రాతపూర్వకంగా రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌కు ఫిర్యాదు చేయడమే కాక, తన సంతకాన్ని ఫోర్జరీ చేసి తాను రాజీనామా చేసినట్లు నకిలీ పత్రాన్ని సృష్టించారని వివరించారు. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకున్న రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌ అధికారులు ABCLలో కొత్త డైరెక్టర్ల నియామకానికి సంబంధించిన పత్రాలను ఆమోదించారు. ఈ వ్యవహారంలో రవిప్రకాశ్ ఫోర్జరీ వ్యవహరాన్ని సీరియస్ గా తీసుకున్న యాజమాన్యం ఆయన్ను పదవి నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకుంది. కొత్త యాజమాన్యం చేతిలో 90 శాతానికి పైగా వాటా ఉండడంతో కంపెనీ నిర్వహణకు సంబంధించి చట్టప్రకారం వారికే పూర్తి నిర్ణయాధికారం ఉంటుంది. ఇందుకు అనుగుణంగా నిర్వహణ బాధ్యతలను కొత్త యాజమాన్యం చేపట్టింది. ABCL యాజమాన్యం మార్పును, కొత్త డైరెక్టర్ల నియామకాన్నీ అడ్డుకునేందుకు రవిప్రకాశ్ ఎన్నో అడ్డదారులు తొక్కినట్లు, ఆయన పాల్పడిన మరికొన్ని అక్రమాలపై కూడా అలంద మీడియా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను చూస్తే…
సంస్థకు హాని కలిగించే దురుద్దేశంతో, సినీ నటుడు శొంఠినేని శివాజీతో దురుద్దేశ పూర్వకంగా కుమ్మక్కై నకిలీ పత్రాలు సృష్టించడమే కాకుండా, సంస్థ యాజమాన్యానికి… కంపెనీ నిర్వాహణలో ఇబ్బందులు కల్పించేలా రవి ప్రకాశ్ ప్రయత్నిస్తున్నారని టీవీ9 యాజమాన్యం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ కుట్రలో భాగంగా కంపెనీకి చెందిన ముఖ్యమైన డాటాను తస్కరించడమే కాక, కంపెనీకి నష్టం చేసే దురుద్దేశంతో ఆ డేటాను బయటి వ్యక్తులకు చేరవేసినట్లు అనుమానాలు ఉన్నాయని కంపెనీ యాజమాన్యం ఫిర్యాదు చేసింది.
అలందా మీడియా ఫిర్యాదు ప్రకారం రవిప్రకాశ్, సినీ నటుడు శివాజీతో కలిసి కుట్ర పూరితమైన చర్యలకు పాల్పడి ABCL యాజమాన్యానికి, కంపెనీకి నష్టం కలిగించే చర్యలకు పాల్పడ్డారు. ఈ వివరాల్లోకి వెళితే, సినీనటుడు శివాజీ ఏప్రిల్ 19, 2019న హైదరాబాద్‌లోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT)ని ఆశ్రయించారు. NCLTలో శివాజీ దాఖలు చేసిన అఫిడవిట్‌ప్రకారం… ABCL లో రవిప్రకాశ్‌కు 20 లక్షల షేర్లు అంటే 8 శాతం వాటా ఉంది. ఇందులోనుంచి 40 వేల షేర్లను కొనుగోలు చేసేందుకు రవి ప్రకాశ్‌కు 20 లక్షల రూపాయలు చెల్లించి ఫిబ్రవరి 20, 2018న ఒప్పందం కుదుర్చుకున్నానని, ఈ ఒప్పందం జరిగిన ఏడాదిలోగా షేర్లను తన పేరు మీద బదిలీ చేసేందుకు రవిప్రకాశ్ అంగీకరించారని, తాను అతని మీద నమ్మకం ఉంచానని శివాజీ పేర్కొన్నారు. అయితే, ABCLలో మార్పులకు సంబంధించి రవిప్రకాశ్ కొన్ని నిజాలను తనవద్ద దాచారని, మోసపూరితంగా వ్యవహరించారని శివాజీ ఆరోపించారు. షేర్ల బదిలీ గురించి తాను పలుమార్లు రవిప్రకాశ్‌కు గుర్తు చేసినా ఏదో ఒక సాకు చూపుతూ, షేర్లు బదిలీ చేయలేదని, దీంతో తాను విసిగిపోయి ఫిబ్రవరి 15, 2019న రవిప్రకాశ్‌కు స్వయంగా నోటీసు అందజేశానని శివాజీ NCLT వద్ద దాఖలు చేసిన తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. దానికి రవి ప్రకాశ్‌ఫిబ్రవరి 17న స్పందిస్తూ షేర్ల బదిలీలో జాప్యానికి NCLT జారీ చేసిన ఒక మధ్యంతర ఉత్తర్వు కారణమని, NCLTలో ఉన్న ఈ వివాదం పరిష్కారం అయిన తర్వాత షేర్లు బదిలీ చేస్తానని సమాధానం ఇచ్చారు. రవిప్రకాశ్, శివాజీల మధ్య 2018 ఫిబ్రవరిలో జరిగినట్లుగా చెబుతున్న షేర్ పర్చేజ్ అగ్రిమెంట్ కేవలం తెల్ల కాగితాలపై ఉండడం గమనార్హం. ఎవరైనా వాటా కొనుగోలు చేస్తే తక్షణం షేర్ల బదిలీ కోరుకుంటారు, కానీ, శివాజీ ఇందుకు ఏడాది గడువు ఇచ్చాననడం అనుమానాలను కలిగిస్తోంది. ఈ అనుమానాల వల్లే, శివాజీ, రవిప్రకాశ్ మధ్య కుదిరనట్లు చెబుతున్నది ఫోర్జరీ ఒప్పందంగా టీవీ9 కొత్త యాజమాన్యం భావిస్తోంది. కొత్త యాజమాన్యానికి ఇబ్బందులు కలిగించే ఉద్దేశ్యంతో రవిప్రకాశ్, శివాజీతో కలిసి కుమ్మక్కై ఈ నాటకానికి తెర తీశారని ABCL కొత్త యాజమాన్యం తన ఫిర్యాదులో పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news