ఈ మధ్య తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో క్యాసినో ఏజెంట్ చీకోటి ప్రవీణ్ పేరు బాగా హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖుల చేత క్యాసినో ఆడించే ప్రవీణ్ పై ఈడీ దాడులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రవీణ్ క్యాసినో పేరుతో హవాలా కూడా నడిపిస్తున్నారని ఈడీ అనుమానిస్తుంది..ఈ క్రమంలో ఆయనని వరుసగా ఈడీ విచారిస్తుంది. అలాగే ఈ విచారణలో చీకోటి కస్టమర్స్ గా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ, రాజకీయ ప్రముఖులు ఉన్నారని తేలింది. అయితే ఇప్పటివరకు ఆ పేర్లు మాత్రం బయటకు రాలేదు.
ఇదే క్రమంలో చీకోటి కస్టమర్స్ లో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారని ఏపీలోని ప్రతిపక్ష టీడీపీ ఆరోపిస్తుంది. అలాగే ఆ మధ్య సంక్రాంతికి గుడివాడలో క్యాసినో జరిగిన విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ నేతలు..కొడాలి నానిని ఏ విధంగా టార్గెట్ చేశారో అందరికీ తెలిసిందే. కానీ కొడాలి తనకు క్యాసినో తో ఎలాంటి సంబంధం లేదని చెప్పేశారు . ఇదే క్రమంలో ఇప్పుడు ప్రవీణ్ ని ఈడీ విచారిస్తున్న నేపథ్యంలో టీడీపీ నేతలు…వైసీపీ నేతలు క్యాసినో ఆడారంటూ ఆరోపణలు చేస్తున్నారు.
అలాగే తాజాగా ప్రవీణ్ ట్విట్టర్ ఖాతా పేరుతో… ‘‘నన్ను బలిపశువును చేయాలని చూస్తే.. నాచేత ఈ పనులు చేయించిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టను. సీఎం అయినా, మంత్రులైన అందరికీ ఒకే న్యాయం’’ అంటూ ఓ ట్వీట్ వచ్చింది. అయితే ఇది ప్రవీణ్ నకిలీ ఖాతా అని తెలుస్తోంది. ఇదంతా ఏపీలోని ప్రతిపక్ష నాయకులు చేయిస్తున్నారని, ఏపీలో ప్రతిపక్షమంటే ఎవరో ప్రపంచమంతా తెలుసని, నకిలీ ట్వీట్ పై ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ప్రవీణ్ తాజాగా ఈడీ విచారణ ఎదుర్కున్న తర్వాత చెప్పారు.
అంటే పరోక్షంగా ప్రవీణ్…టీడీపీని టార్గెట్ చేశారని చెప్పొచ్చు. టీడీపీనే పదే పదే ప్రవీణ్ తో వైసీపీ నేతలకు సంబంధాలు ఉన్నాయని మాట్లాడుతుంది. మరి ప్రవీణ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే..ఏపీలో రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.