హుజురాబాద్ ఉప ఎన్నికతో రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా మరింత హీటెక్కింది. ఈ బై పోల్‌ను అధికార పార్టీ ఫుల్ సీరియస్‌గా తీసుకున్నది. స్వయంగా సీఎం కేసీఆర్ నియోజకవర్గాన్ని పర్యవేక్షించడంతో పాటు నేతలను సమన్వయం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ‘దళిత బంధు’ పైలట్ ప్రాజెక్టు, గొర్రెల పంపిణీ, ఈటల అనుచరులకు పదవులు, మంత్రుల పర్యటనలు తదితర కార్యక్రమాలు మనం చూడొచ్చు. అయితే, ఇప్పటి వరకు ఈటల పాదయాత్రతో మైలేజ్ తెచ్చుకోగా దానికి చెక్ పెట్టేందుకు టీఆర్ఎస్ పార్టీ సరికొత్త వ్యూహాన్ని తెరమీదకు తీసుకొచ్చింది. అదేంటంటే..
మాజీ మంత్రి ఈటల రాజేందర్ పలు సార్లు మాట్లాడుతూ తాను బీసీ బిడ్డనని చెప్పుకున్నారు. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ దొర అని పేర్కొన్నారు. అయితే, అధికార పార్టీ ఈటలను దళిత ద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నం కౌంటర్ అటాక్‌గా చేస్తోంది. అందుకే దళిత బంధును హుజురాబాద్‌లో ప్రారంభించేందుకు ప్రయత్నిస్తోంది. దాంతో పాటు దళిత నేతలకు పదవులు కట్టబెడుతోంది అధికార పార్టీ. మొత్తంగా దళిత రాగాన్ని ఎత్తుకుని ఈటల రాజేందర్, ఆయన కుటుంబీకులు దళిత ద్రోహులను చెప్పే ప్రయత్నం చేస్తోంది. ఈటల బావమరిది ఇతరులు దళితులకు వ్యతిరేకంగా పని చేశారనే ప్రచారానికి సిద్ధమవుతోంది.
ఇక బీజేపీలో చేరినప్పటి నుంచి ఈటల రాజేందర్‌కు సీనియర్ల నుంచి మద్దతు లభించడం లేదనే వార్తలు జోరుగా వస్తున్నాయి. ఇప్పటికే ఆ పార్టీ నుంచి మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, ఇనుగాల పెద్దిరెడ్డి బయటకు వచ్చారు. మోత్కుపల్లి హుజురాబాద్‌లో టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించడంతో పాటు ఈటలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని ప్రకటించారు. ఇక ఇనుగాల పెద్దిరెడ్డి అధికార పార్టీ గూటికి చేరారు. ఈ క్రమంలోనే మొత్తంగా బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను ఓడించేందుకు గాను అధికార పార్టీ సర్వశక్తులను ఒడ్డేందుకు ప్రయత్నిస్తోంది.