ఎస్సీ వర్గీకరణ కోసం కమిటీ వేశాం – అమిత్‌షా

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మరో కీలక ప్రకటన చేశారు కేంద్ర కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని చెప్పిన ఆయన… కాంగ్రెస్‌,బీఆర్‌ఎస్‌ పార్టీలపై విమర్శలు గుప్పించారు. దళితులను కేవలం ఓటు బ్యాంకుగా ఆ రెండు పార్టీలు వాడుకుంటున్నాయని మండిపడ్డారు. ప్రధాన మంత్రి ఆదేశాలతో ఎస్సీ వర్గీకరణను వేగవంతం చేస్తూ కమిటీని ఏర్పాటు చేశామని చెప్పారు.

శనివారం హైద్రాబాద్ సోమాజీగూడలో అమిత్ షా మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలు ఈసారి మార్పును కోరుకుంటున్నారని అన్నారు.యువత, దళితులు, వెనుకబడిన వర్గాలు చాలా అసంతృప్తిగా ఉన్నారని, ఈ నెల 30న జరిగే పోలింగ్ లో బీజేపీ అభ్యర్థులకు భారీ మెజారిటీ ఇవ్వాలని కోరారు. చైతన్యవంతమైన తెలంగాణ ఓటర్లు బీజేపీకి, మోదీకి అండగా ఉంటారని అమిత్ షా విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ ఓటర్ల నిర్ణయం రాష్ర్ట భవిష్యత్తును, దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుందని అమిత్ షా చెప్పారు.

బీఆర్‌ఎస్‌ పార్టీపై ఆయన మరోసారి విమర్శలు గుప్పించారు.ఆ పార్టీ అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. మియాపూర్ భూకుంభకోణం, మిషన్ కాకతీయ, కాళేశ్వరం, ఔటర్ రింగ్ రోడ్డు టోల్, మద్యం, గ్రానైట్ కుంభకోణం వంటివాటిలో కేసీఆర్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని కేసీఆర్‌ సర్కార్ అమలు చేయలేదన్నారు.

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షా పత్రాలు లీకయ్యాయని ఆయన చెప్పారు. టీఎస్‌పీఎస్ సీ పేపర్ లీక్ వెనుక ఎవరూ ఊహించని పెద్ద కుంభకోణం ఉందని అన్నారు.నిరుద్యోగులకు ప్రతి నెల భృతి ఇస్తామని చెప్పి యువతను మోసం చేశారని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు మాత్రమే దళితబంధు నిధులు అందాయని ఆరోపించారు.డబుల్ బెడ్ రూమ్‌ స్కీములో చేతివాటం ప్రదర్శించారని.. ఇంకా ఫిల్మ్ సిటీ, ఫార్మా సిటీ, టెక్స్ టైల్ సిటీ, ఎడ్యుకేషన్ సిటీ వంటి హామీలన్నీ ఉత్తుత్తివే అని ఎద్దేవా చేశారు. సిటీ పేరుతో కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులను భూములను కబ్జా చేసి పేదలను నిలువునా దోచుకున్నారని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ కు ఓటేస్తే బీఆర్ఎస్ కు ఓటేసినట్టేనని చెప్పారు.

రామమందిరం, ట్రిపుల్ తలాక్ , ఆర్టికల్ 370 వంటి అంశాల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను బీజేపీ సర్కార్ అమలు చేసిందని గుర్తు చేశారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించి వరికి క్వింటాలుకు రూ.3,100 మద్ధతు ధర ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రజల కోసం పారాబాయిల్డ్ రైస్ కొనుగోలు చేస్తామన్నారు.

మోడీ ప్రభుత్వం పెట్రో ఉత్పత్తులపై పన్నులు తగ్గిస్తే బీజేపీ పాలిత రాష్ట్రాలు చాలావరకు అమలు చేశాయన్నారు.కానీ కాంగ్రెస్ పాలిత ప్రాంతాలు నామమాత్రంగా పన్నులను తగ్గించాయన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ సర్కార్ కూడా వ్యాట్ తగ్గించలేదని గుర్తు చేశారు.తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే వ్యాట్ తగ్గిస్తామని హమీ ఇచ్చారు. వయోవృద్ధులకు ఉచితంగా అయోధ్య, కాశీ దర్శనం చేయిస్తామని చెప్పారు. పీవీ నరసింహారావు, టి.అంజయ్య లను కాంగ్రెస్ పార్టీ అవమానించిందని మరోసారి గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version