లేదంటే కాంగ్రెస్ పార్టీ అతి త్వరలో సరైన ఓట్లు దక్కించుకోలేక జాతీయ పార్టీ హోదాను కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. ముఖ్యంగా కమ్యూనిస్టులు ఆ విధంగానే జాతీయ హోదాను కోల్పోయారు. ఇప్పటికీ పూర్వ ప్రాభవం కోసం తమకు పట్టున్న ప్రాంతాల వైపు ప్రీతిపాత్రంగా చూస్తున్నా ఫలితాలు అయితే నమ్మదగ్గ విధంగా లేవు.
ఇక రాజస్థాన్ ఉదయపూర్ డిక్లరేషన్ ఏ విధంగా జనంలోకి వెళ్తుందో చూడాలి. ఇక్కడ నిర్వహిస్తున్న చింతన్ శివిర్ ఆ పార్టీకి ఎంతో అవసరం అయిన పరిణామం. గతం కన్నా గొప్పగా పార్టీ ఎదుగుదల ఉంటేనే అనుకున్నవి అన్నీ సాధ్యం.. ఇకపై ఒక కుటుంబం ఒక టికెట్ అని చెప్పి మళ్లీ గాంధీ కుటుంబాలకు అందునుంచి మినహాయింపు ఇవ్వడం ఏంటి అన్న సందేహాలూ నెలకొన్నాయి. ఏ విధంగా చూసుకున్నా సోనియాకు ఇకపై మార్గం అంతా ముళ్లే ఉంటాయి. పూలు ఉండవు. పూలు లేవు కనుక ప్రయాణం నుంచి నిష్క్రమిస్తే పార్టీ అన్నది ఆమెకు దక్కకుండా పోతుంది. చింతన్ శివిర్ అన్నది ఓ విధంగా ఓ మంచి ఉద్దేశంతో నిర్వహిస్తున్న అంతర్మథన సంబంధిత కార్యక్రమం. అంటే ఏం దిద్దుకోవాలి ? ఏం నేర్చుకోవాలి ? ఏం వదులు కోవాలి ? ఏం వద్దనుకోవాలి అన్నవి తెలుసుకుని రాజకీయం చేయాల్సిన సమయం రానే వచ్చింది.