నారాయణఖేడ్‌లో కాంగ్రెస్‌లో పోరు…కారుకు ప్లస్..కమలానికి నో ఛాన్స్!

నారాయణఖేడ్‌లో: ఉమ్మడి మెదక్ జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం..ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోట. పట్లోళ్ళ కిష్టారెడ్డి..ఇక్కడ పలుమార్లు విజయం సాధించి కాంగ్రెస్ జెండా ఎగరవేశారు. మొదట నుంచి ఇక్కడ కాంగ్రెస్ హవా నడుస్తూనే ఉంది. మధ్యలో 1994 ఎన్నికల్లోనే అక్కడ టి‌డి‌పి గెలిచింది. మళ్ళీ 1999, 2004, 2009, 2014 ఎన్నికల్లో వరుసగా కాంగ్రెస్ గెలవగా, కాంగ్రెస్ నుంచి కిష్టారెడ్డి గెలుస్తూ వచ్చారు.

అంతకముందు 1989లో కూడా గెలిచారు. అయితే 1985, 1978లో శివరావు షెట్కార్ గెలిచారు. ఇక ఇలా కాంగ్రెస్ హవా నడుస్తున్న నారాయణఖేడ్ లో 2016 ఉపఎన్నికలో బి‌ఆర్‌ఎస్ గెలిచింది. అప్పుడు బి‌ఆర్‌ఎస్ నుంచి మహారెడ్డి భూపాల్ రెడ్డి గెలిచారు. ఇక 2018 ఎన్నికల్లో మళ్ళీ భూపాల్ రెడ్డి గెలిచారు..అప్పుడు కాంగ్రెస్ సీటు కోసం కుమ్ములాటలు జరిగాయి. ఓ వైపు కిష్టారెడ్డి తనయుడు సంజీవ రెడ్డి, మరో వైపు శివరావు షెట్కార్ తనయుడు సురేష్ షెట్కార్..ఈ ఇద్దరు సీటు కోసం పోటీ పడ్డారు. చివరి నిమిషంలో శివరావు ఢిల్లీ పెద్దలని ఒప్పించి తన తనయుడుకు సీటు ఇప్పించుకున్నారు.

దీంతో సంజీవ రెడ్డి బి‌జేపిలో చేరి పోటీ చేశారు. ఈ క్రమంలో సురేష్‌కు 37 వేల ఓట్లు, సంజీవ రెడ్డికి 33 వేల ఓట్లు పడ్డాయి..రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఇక 2019 పార్లమెంట్ ఎన్నికల సమయంలో సంజీవ రెడ్డి మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చారు. దీంతో మళ్ళీ నారాయణఖేడ్ కాంగ్రెస్ లో పోరు నడుస్తోంది.

ఇప్పుడు ఆ సీటు ఎవరికి దక్కుతుందో అర్ధం కాకుండా ఉంది. ఇక ఒకరికి సీటు దక్కితే మరొకరు సహకరించే పరిస్తితు ఉండదు. దీని వల్ల మళ్ళీ బి‌ఆర్‌ఎస్‌కే బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ బి‌జే‌పికి పెద్ద బలం లేదు. మొత్తానికి ఇక్కడ కాంగ్రెస్ లో పోరు కారుకు కలిసొస్తుంది.