18న కాంగ్రెస్ నిరసన.. మళ్లీ ఆలస్యంగా మేల్కొన్న హస్తం పార్టీ

-

రాష్ట్ర రాజకీయాలు వడ్ల కొనుగోలు చుట్టూ తిరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయనంటోందని టీఆర్‌ఎస్ ఆరోపిస్తుండగా, కాదు కాదు రాష్ట్రమే కొనుగోలు చేయడం లేదని బీజేపీ వాదిస్తోంది. పోటాపోటీ ఆందోళనలు, ఘర్షణలకు కూడా దిగుతున్నాయి. ఈ నెల 12న నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ ఆందోళనలకు పిలుపునివ్వగా ధాన్యం కొనుగోలు కేంద్రాల సందర్శనకు బండి సంజయ్ వెళ్లారు. నిన్న ప్రెస్‌మీట్ పెట్టిన కేసీఆర్ బీజేపీకి రెండు రోజుల డెడ్‌లైన్ విధించాడు. లేదంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరించాడు. ఇక, ఆలస్యంగా మేల్కొన్న కాంగ్రెస్ పార్టీ వడ్ల కొనుగోళ్ల పంచాయితీలోకి దిగింది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నాటకాలు ఆడుతున్నాయని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆరోపిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ధాన్యం కొనుగోలు చేసి తీరాల్సిందేనని పేర్కొంటున్నారు. గురువారం (ఈ నెల 18న) పబ్లిక్ గార్డెన్ నుంచి వ్యవసాయ కమిషనరేట్ వరకు నిరసనక ప్రదర్శనకు పిలుపు ఇచ్చారు. కర్షకుడా కదిలి రా.. ధాన్యం కొనే వరకు ఉద్యమిద్దాం అనే నినాదంపై ఉదయం 11గంటలకు నిర్వహించే నిరసనకు తరలిరావాలని కోరారు.

ఈటల రాజేందర్, హుజూరాబాద్ ఉప ఎన్నికలు విషయంలో ఆలస్యంగా కళ్లు తెరిచిన కాంగ్రెస్ పార్టీ వడ్ల కొనుగోలు విషయంలోనూ అదే చేసింది. వడ్ల కొనుగోలు విషయంలో టీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు పైచేయి సాధించేందుకు యుద్ధమే చేస్తున్నాయి. క్షేత్ర స్థాయిలో ఘర్షణలకు సైతం దిగుతున్నాయి. గత వారం రోజులుగా జరుగుతున్న వడ్ల పంచాయితీని కాంగ్రెస్ పార్టీ పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తీరికగా ఢిల్లీలో హుజూరాబాద్ ఉప ఎన్నికలపై సమీక్ష నిర్వహించి, ఇప్పుడు ఆందోళనలకు పిలుపునిచ్చారని పేర్కొంటున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్న తరుణంలో కాంగ్రెస్ ముందే మేల్కొని ఉంటే పైచేయి సాధించి ఉండేదని అభిప్రాయపడ్డారు. ఇద్దరినీ దోషులుగా నిలబెట్టే అవకాశాన్ని కాంగ్రెస్ అందిపుచ్చుకోలేకపోయిందని విమర్శిస్తున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news