మోడీ విషయమై అమర్యాదకర రీతిలో ప్రవర్తించవద్దు అని చెప్పారు తమిళనాడు సీఎం స్టాలిన్. ఎంత గొప్ప మాట. ఎంత పరిణితితో కూడిన మాట. ఈ దేశ ప్రధానిని గౌరవించే తీరుకు ఇది సంకేతం. మీరు మీ అభ్యంతరాలు చెప్పండి కాదనం కానీ అభ్యంతరకర రీతిలోనో, అవమానకర రీతిలోనో ప్రవర్తించడం తప్పు అని అంటారే.. అందుకు సంకేతం ఆయన ప్రవర్తన. నిన్నటి వేళ కూడా తానేం చెప్పాలనుకున్నారో చెప్పారు. తమిళ భాషకు ఉన్న ఔన్నత్యం సభా ముఖంగానే చెప్పారు. నీట్ నుంచి తమ రాష్ట్రానికి మినహాయింపు ఇవ్వాలనే కోరారు. ఇది కదా కావాలి. కానీ కేసీఆర్ ఏం చేశారో చూద్దాం.
నిన్నటి వేళ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వార్షికోత్సవానికి పీఎం వచ్చారు. ఆ సంస్థకు సంబంధించి ఇరవై ఏళ్ల పండుగకు వచ్చారు. కానీ కేసీఆర్ ఇక్కడ లేరు. అర్జెంట్ పని ఉందన్న విధంగా బెంగళూరుకు వెళ్లిపోయారు. రానున్న ఎన్నికల్లో భాగంగా పొత్తుల విషయమై చర్చించేందుకు జేడీఎస్ నేతలయిన దేవెగౌడ, కుమార స్వామితో భేటీ అయ్యారు. ఇది మాత్రం తప్పు. ఎందుకంటే ఓ దేశ ప్రధానిని గౌరవించే పద్ధతి అయితే ఇది కాదు. ఇప్పటికి ఆయన ఈ విధంగా నడుచుకోవడం మూడో సారి.
అదేవిధంగా మోడీ తెలంగాణకు వస్తే గో బ్యాక్ మోడీ అని చెప్పడం కూడా తప్పు. ఆరోజు చంద్రబాబు కూడా ఇలాంటి తప్పిదమే చేశారు. విభేదాలు ఎన్ని ఉన్నా కూడా.. ఓ దేశ ప్రధానికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాల్సిందే..! అవి రెండు ప్రాంతాల మధ్య రెండు ప్రభుత్వాల మధ్య సఖ్యతను పెంపొదిస్తాయి.