ఖమ్మంలో కారుకు ‘లోకల్’ సెగ.. సీనియర్లు దెబ్బ వేస్తారా?

-

తెలంగాణలో రాజకీయం రోజురోజుకూ మారిపోతుంది. అధికార టీఆర్ఎస్‌కు వ్యతిరేక పవనాలు వీయడం మొదలైపోయాయి. ఒక వైపు కాంగ్రెస్, మరో వైపు బీజేపీలు టీఆర్ఎస్‌ని దెబ్బకొట్టడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇదే సమయంలో సొంత పార్టీలో ఉండే అసంతృప్తి కూడా టీఆర్ఎస్‌కు మైనస్ అయ్యేలా కనిపిస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్సీ పదవుల విషయంలో టీఆర్ఎస్‌లో రచ్చ నడుస్తోంది. పదవులు దక్కనివారు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు.

TRS-Party | టీఆర్ఎస్
TRS-Party | టీఆర్ఎస్

ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో స్థానిక సంస్థల కోటాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలో కారు పార్టీకి అసంతృప్తుల సెగ గట్టిగా తగిలేలా కనిపిస్తోంది. జిల్లాలో ఉన్న ఒక సీటుపై సీనియర్లు అయిన మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు ఆశ పెట్టుకున్నారు. కానీ వీరిని కేసీఆర్ పక్కనబెట్టి… పల్లా రాజేశ్వర్ రెడ్డి అనుచరుడు తాతా మధుకు అవకాశం ఇచ్చారు.

ఆయనకు ఎమ్మెల్సీ సీటు ఖరారు చేశారు. ఆయన నామినేషన్ దాఖలు చేయడం కూడా జరిగిపోయింది. అయితే ఇక్కడ కాంగ్రెస్ కూడా బరిలో దిగింది. కాంగ్రెస్ తరుపున నాగేశ్వరరావు పోటీ చేస్తున్నారు. ఇక్కడ స్థానిక సంస్థల్లో టీఆర్ఎస్‌కు బలం ఎక్కువగా ఉంది. ఆ బలం బట్టి చూసుకుంటే ఈ సీటు టీఆర్ఎస్‌ ఖాతాలోనే పడుతుంది. కానీ ఇక్కడ టీఆర్ఎస్‌లో ఉన్న అసంతృప్తి సెగ కొంప ముంచేలా ఉంది. ఎందుకంటే సీనియర్ నేతలు తుమ్మల, పొంగులేటిలు పదవి దక్కకపోవడంపై గుర్రుగా ఉన్నారు. ఈ ఇద్దరు మధు నామినేషన్ కార్యక్రమానికి కూడా హాజరు కాలేదు.

పైగా వీరి వర్గాలు కూడా టీఆర్ఎస్ అధిష్టానంపై గుర్రుగా ఉన్నాయి. అలాగే ఈ ఇద్దరు నేతలకు కొందరు స్థానిక ప్రజా ప్రతినిధులు టచ్‌లో ఉన్నారని తెలుస్తోంది. వారు గానీ క్రాస్ ఓటింగ్ చేశారంటే ఖమ్మంలో కారుకు పంక్చర్లు పడేలా ఉన్నాయి. అందుకే ఈ ఇద్దరు సీనియర్లని అధిష్టానం బుజ్జగించే పనిలో ఉన్నట్లు కనిపిస్తోంది. మరి చూడాలి ఈ ఇద్దరు సీనియర్లు కారుని కాపాడతారో…డ్యామేజ్ చేస్తారో.

Read more RELATED
Recommended to you

Latest news