ఎడిట్ నోట్: ‘బీఆర్ఎస్’ @ ప్రాంతీయ పార్టీ.!

-

తెలంగాణలో వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చి..తిరుగులేని ఆధిక్యం సంపాదించిన కేసీఆర్..జాతీయ రాజకీయాల్లో కూడా సత్తా చాటాడానికి రెడీ అయ్యారు. కేంద్రంలో మోదీ సర్కార్‌కు చెక్ పెట్టడమే లక్ష్యంగా కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారు. జాతీయ రాజకీయాల్లో కూడా రాణించాలని చెప్పి..ఇప్పుడు ప్రాంతీయ పార్టీగా ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి(టి‌ఆర్‌ఎస్)ని జాతీయ పార్టీగా భారత్ రాష్ట్ర సమితి(బి‌ఆర్‌ఎస్)గా మార్చారు.

ఇక పేరు మార్పు జరిగిపోయింది..పార్టీ జెండా, పార్టీ గుర్తు అలాగే ఉండనుంది. అయితే పేరు మార్పు టీఆర్ఎస్ ప్రతినిధులు తాజాగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన విషయం తెలిసిందే. టీఆర్‌ఎస్‌ జనరల్‌ బాడీ సమావేశంలో ఆమోదించిన తీర్మానంతో పాటు, ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ రాసిన లేఖను కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ ఎన్నికల కమిషనర్‌కు టీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ అందించారు. అలాగే పేరు మార్పుకు ఎన్నికల సంఘం ఆమోదం తెలుపుతుందని మాట్లాడారు.

అటు ఎన్నికల సంఘం కూడా పేరు మార్పు ఎలాంటి అడ్డంకులు ఉండవని చెప్పుకొచ్చింది. కాకపోతే పేరు మారినా సరే బి‌ఆర్‌ఎస్ అనేది ఇంకా ప్రాంతీయ పార్టీగానే ఉంటుంది తప్ప..జాతీయ పార్టీ కాదు. ఎందుకంటే నిబంధనల ప్రకారం జాతీయ పార్టీకి అవసరమైన ఓట్ల శాతం, సీట్లు వచ్చినప్పుడే దానికి జాతీయ పార్టీగా గుర్తింపు వస్తుంది. చెప్పుకోవడానికి బి‌ఆర్‌ఎస్ జాతీయ పార్టీ అని చెప్పుకోవచ్చు గాని..అధికారికంగా మాత్రం జాతీయ పార్టీ కాదు.

అలా అవ్వాలంటే కేంద్ర ఎన్నికల సంఘం-1968 నిబంధనల ప్రకారం ఆ పార్టీ చివరి సారిగా జరిగిన లోక్ సభ లేదా అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో నాలుగు లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాల్లో పోటీ చేసి ఉండాలి. ఆ ఎన్నికల్లో నమోదై చెల్లుబాటైన ఓట్లలో ఆరు శాతం ఓట్లను సదరు పార్టీ సాధించాలి. కనీసం నాలుగు రాష్ట్రాల్లోనైనా ప్రాంతీయ పార్టీగా ఎన్నికల సంఘం దగ్గర గుర్తింపు పొంది ఉండాలి. ఏదైనా ఒక రాష్ట్రం లేదా రాష్ట్రాల నుంచి కనీసం నలుగురు అభ్యర్థులైనా ఎంపీలుగా ఎన్నికై ఉండాలి.

గత సాధారణ ఎన్నికల్లో లోక్‌సభలోని మొత్తం సీట్లలో కనీసం రెండు శాతం సీట్లను ఆ పార్టీ గెలుచుకొని ఉండాలి. మూడు రాష్ట్రాల నుంచి అభ్యర్థులు గెలుపొంది వుండాలి. మరి ఈ నిబంధనలని బట్టే బి‌ఆర్‌ఎస్ జాతీయ పార్టీగా గుర్తింపు పొందుతుంది. అయితే వచ్చే ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా కనీసం 100 పైనే ఎంపీ సీట్లలో పోటీ చేయాలని కేసీఆర్ చూస్తున్నారు. మరి తెలంగాణలోనే కేసీఆర్ పార్టీకి కాస్త గడ్డు పరిస్తితులు ఉన్నాయి. మరి అలాంటప్పుడు దేశ రాజకీయాల్లో ఎంతవరకు రాణించి..బి‌ఆర్‌ఎస్‌ని జాతీయ పార్టీగా మార్చుకుంటారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news