ఏపీకి సరే.. తెలంగాణ సంగతేంటమ్మ.. సవతి తల్లి ప్రేమ ఎందుకు..!

-

ఏపీకి నిధుల వ‌ర‌ద‌.. తెలంగాణ ముఖాన బుర‌ద అన్న‌ట్టుంది కేంద్ర ప్ర‌భుత్వ వైఖ‌రి. అందుకు నిద‌ర్శ‌న‌మే ఈరోజు ప్ర‌వేశ‌పెట్టిన కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ‌కు నిధులు కేటాయించ‌క‌పోవ‌డ‌మే. దీనిపై అధికార కాంగ్రెస్ పాటు ప్ర‌తిప‌క్ష బీఆర్ఎస్‌ నేత‌లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఈ బడ్జెట్‌లో తెలంగాణకు ఎప్పటిలాగే నరేంద్ర మోదీ సర్కారు మళ్లీ మొండిచెయ్యే చూపించింది. పక్కనున్న తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌పై వరాల జల్లు కురిపించిన కేంద్రం.. బడ్జెట్ స్పీచ్ మొత్తంలో కనీసం ఒక్కసారంటే ఒక్కసారి కూడా తెలంగాణ పేరు ప్రస్తావించకపోవటం శోచనీయం. గతంలో.. కేసీఆర్ ప్రభుత్వం, మోదీ సర్కార్‌తో సఖ్యంగా లేకపోవటం వల్లే.. తెలంగాణపై కేంద్రం శీతకన్ను వేసిందని అనుకున్నా… ఇప్పుడు కేంద్రంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం సఖ్యత‌గా ఉన్నప్ప‌టికీ అదే వైఖరి అవ‌లంబిస్తోంది.

రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా పెట్టుకున్న‌ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య‌మంత్రి అయ్యాక తన మంత్రి బృందంతో.. ప్రధాన మంత్రి మోదీని కలిశారు. కేంద్ర మంత్రులను కూడా ఒక‌టికి రెండు సార్లు కలిసి.. రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తులు చేశారు. గతంలో మోదీ సర్కారుతో కేసీఆర్ విభేదించటం, విమర్శించటం వల్లే రాష్ట్రానికి ఎలాంటి నిధులు కేటాయించలేదని ప‌లుమార్లు రేవంత్‌రెడ్డి చెప్పుకొచ్చారు. ప్రత్యర్థులైనప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మ‌ధ్య‌ సత్సంబంధాలు కొనసాగించటం వల్ల మేలు జరుగుతుందని రేవంత్ చాలాసార్లు చెప్పారు.

ప‌క్క రాష్ట్ర సీఎం చంద్ర‌బాబుతో త‌న‌కు మంచి అనుబంధం ఉన్న నేప‌థ్యంలో ఈ బ‌డ్జెట్‌లో తెలంగాణ‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని రేవంత్ సైతం ఆశ‌లు పెట్టుకున్నారు. కానీ అవేమీ ఈ బ‌డ్జెట్‌లో ప‌నిచేయ‌లేద‌నే చెప్పాలి. ప్రక్కనే ఉన్న ఏపీకి మాత్రం.. రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్లు సాయం చేస్తామ‌ని ప్ర‌క‌టించింది. పోలవరం సత్వర నిర్మాణానికి కూడా సాయం అందిస్తామని.. ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి కట్టుబడి ఉన్నామని స్ప‌ష్ట‌మైంది.ఏపీలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని ప్రకటించారు. విశాఖ-చెన్నై, ఓర్వకల్లు- బెంగళూరు మధ్య ఏర్పాటు చేయబోయే ఇండస్ట్రీ కారిడార్లకు నిధులు కేటాయిస్తామని ప్రకటించటం గమనార్హం.కానీ తెలంగాణ పేరు ప్ర‌స్తావించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

తెలంగాణ రాష్ర్టంలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాల‌నుకుంటున్న భార‌తీయ జ‌న‌తాపార్టీ మొన్న‌టి ఎన్న‌కల్లో త‌ద‌నుకుణంగా రాజ‌కీయాలు చేసింది. ఈ నేప‌థ్యంలో తెలంగాణ నుంచి బీజేపీ తరపున 8 మంది ఎంపీలు గెలిచారు. గ‌తం కంటే మెరుగైన ఫ‌లితాలు రావ‌డంతో లోక‌ల్ బీజేపీ నేత‌లు కూడా సంతోషించారు.  భ‌విష్య‌త్ తెలంగాణ బీజేపీదేన‌ని కేడ‌ర్ ఊహించింది. తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులుగా ఉన్నా కూడా కేంద్రం వివక్ష చూపటమనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ ప్రభుత్వంలోనూ ఇలాగే చేసిన కేంద్రం.. ఇప్పుడు రేవంత్ సర్కారులోనూ బడ్జెట్‌లో రిక్తహస్తమే చూపించటం తెలంగాణ ప్రజలపై వివక్ష చూపటమేనని నేతలు మండిపడుతున్నారు. రెండు తెలుగు రాఫ్ట్రాల‌కు స‌మ‌న్యాయం చేసుంటే బాగుండేద‌ని విష్లేష‌కులు భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version