మొత్తానికి దేశ రాజకీయాలు ఎటువైపు వెళుతున్నాయో క్లారిటీ వచ్చింది. రానున్న ఎన్నికల్లో పోరు ఎవరి మధ్య జరగనుందో తేలిపోయింది. థర్డ్ ఫ్రంట్..ఫోర్త్ ఫ్రంట్‌లు అనేవి లేకుండా విపక్షాలు మొత్తం ఏకమై ‘ఇండియా’ ఫ్రంట్ గా ఏర్పడ్డాయి. బిజేపిని గద్దె దించడమే లక్ష్యంగా విపక్ష నేతలు బెంగళూరులో సమావేశమైన విషయం తెలిసిందే. ఇక విపక్షాలకు ఛాన్స్ ఇవ్వకుండా తమ పాత, కొత్త మిత్రులని కలిపి ఢిల్లీలో బిజేపి ఎన్డీయే సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంది. మళ్ళీ అధికారంలోకి రావడమే టార్గెట్ గా పెట్టుకుంది.
అయితే ఈ రెండు కూటముల్లో తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్న ఏకైక ప్రాంతీయ పార్టీ జనసేన మాత్రమే. ఎలాగో బిజేపితో పొత్తు ఉంది కాబట్టి బిజేపి నుంచి పవన్‌కు పిలుపు వచ్చింది.ఆయన సమావేశాలకు హాజరయ్యారు. టిడిపికి అటు ఎన్డీయే, ఇటు విపక్షాల నుంచి పిలుపు రాలేదు. టిడిపి న్యూట్రల్ గా ఉండిపోయింది. ఇదే సమయంలో టిడిపి-జనసేన-బిజేపి కలిసే ఛాన్స్ ఉందని పవన్ అన్నారు. ఇక టిడిపిని బిజేపికి దగ్గర చేసేందుకు పవన్ ఢిల్లీలో పావులు కదుపుతున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే టిడిపి కూడా ఎన్డీయేలో చేరిపోతుంది.
ఇటు తెలంగాణ సిఎం కేసిఆర్..కేంద్రంలో బిజేపిని గద్దె దించాలని చెప్పి టిఆర్‌ఎస్‌ని కాస్త బిఆర్‌ఎస్ గా మార్చి జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. బిజేపికి వ్యతిరేకంగా ఉన్నా సరే విపక్ష కూటమి వైపు వెళ్లలేదు. ఎందుకంటే అందులో కాంగ్రెస్ ఉంది. అయితే ఈయన పరోక్షంగా బిజేపికి సహకరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
విమర్శలు ఎలా ఉన్న..ప్రస్తుతం కేసిఆర్ న్యూట్రల్ గా వెళ్లనున్నారు. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తే..ఆ తర్వాత జరిగే పార్లమెంట్ ఎన్నికల ముందు కేసిఆర్ ఎటువైపు వెళ్లాలనేది తేల్చుకునే ఛాన్స్ ఉంది.
ఇటు ఏపీ సిఎం జగన్..ఏ పక్షంతో లేరు. కాకపోతే రాష్ట్రం కోసం కేంద్రంలో బిజేపితో సఖ్యతగా ఉన్నారు. ఇప్పుడు బిజేపి-టిడిపి కలిస్తే సీన్ మారుతుంది. అయినా సరే జగన్ న్యూట్రల్ గానే ఉంటారు..ఏపీలో గెలిచాక..కేంద్రంలో ఎవరు గెలిస్తే వారితో సఖ్యతగా ఉండటమే జగన్ వ్యూహం.