చంద్రబాబుని టార్గెట్ చేసిన కేటీఆర్‌.. మళ్ళీ వర్కౌట్ అవుతుందా?

-

తెలంగాణ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ పూర్తిగా దెబ్బతినడానికి కారణం చంద్రబాబు అని నిర్మొహమాటంగా చెప్పేయొచ్చు. రాష్ట్ర విభజన సమయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలతో తెలంగాణలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బలే తగిలాయి. అలాగే రాష్ట్ర విభజన జరిగాక ఏపీ సీఎంగా చంద్రబాబు, తెలంగాణతో ఎలా కయ్యం పెట్టుకున్నారో కూడా తెలిసిందే. ఇక అక్కడ నుంచి తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్, టీడీపీని వీక్ చేస్తూ వచ్చింది. చంద్రబాబు తెలంగాణ ద్రోహి అని, టీడీపీ ఏపీ పార్టీ అని ముద్రవేసి కేసీఆర్ ప్రభుత్వం రాజకీయంగా టీడీపీని దెబ్బకొట్టింది. ఆ పార్టీలోని నాయకులని పెద్ద ఎత్తున చేర్చుకున్నారు. ఇక 2018లో కాంగ్రెస్-టీడీపీ పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా టీఆర్ఎస్, చంద్రబాబునే టార్గెట్ చేసింది. దీంతో కాంగ్రెస్ కూడా నష్టపోయింది. 2019లో ఏపీలో జగన్ గెలవడానికి కేసీఆర్ సహకరించారు. దీంతో అక్కడ కూడా బాబుకు ఓటమి వచ్చింది. ఆ తర్వాత నుంచి చంద్రబాబు తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టడం లేదు.

అయితే ఇప్పుడు తెలంగాణ పీసీసీ పదవి రేవంత్ రెడ్డికి ఇవ్వడంతో అసలు రచ్చ మొదలైంది. రేవంత్, చంద్రబాబు మనిషి విమర్శలు వస్తున్నాయి. టీపీసీసీ కాస్త టీటీడీపీగా మారిపోయిందని సొంత పార్టీ ఎంపీనే విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్, చంద్రబాబుని మళ్ళీ టార్గెట్ చేశారు.  తెలంగాణ ఉద్యమ సమయంలో సోనియా గాంధీని బలిదేవత అని వర్ణించిన రేవంత్‌.. ప్రస్తుతం ఆమెను తెలంగాణ తల్లి అని కీర్తిస్తున్నారని, రేపో ఎల్లుండో  చంద్రబాబును తెలంగాణ తండ్రి అని చెప్పే అవకాశం కూడా ఉందని ఎద్దేవా చేశారు.

రేవంత్‌కు టీడీపీని వీడినా పాత వాసన పోవడం లేదని, ఇప్పటికే టీపీసీసీని టీడీపీసీసీ అని పిలుస్తున్నారని అన్నారు. అంటే రేవంత్‌కు చంద్రబాబు మనిషి అని ముద్రవేస్తే, మళ్ళీ రాజకీయంగా కాంగ్రెస్‌ని కూడా దెబ్బతీయోచ్చని కేటీఆర్ వ్యూహంగా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మళ్ళీ పాత ఫార్ములాని తెరపైకి తీసుకొచ్చి చంద్రబాబు పేరు చెప్పి రేవంత్‌ని దెబ్బకొట్టడానికి చూస్తున్నారని, మరి ఆ ఫార్ములా ఏ మేర వర్కౌట్ అవుతుందో చూడాలని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news