ఒకేసారి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధులని ప్రకటించి కేసిఆర్ దూకుడు ప్రదర్శించారు. కానీ అలా అభ్యర్ధులని ప్రకటించడం కూడా పెద్ద తలనొప్పిగా మారింది. చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నా సరే..ఏదో ఏడుగురుని మాత్రమే పక్కన పెట్టారు. దీంతో పార్టీ సీట్లు ఆశించిన నేతలు అసంతృప్తిలో ఉన్నారు. వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలని పక్కన పెట్టి తమకు సీటు ఇస్తారని ఆశించారు. కానీ అది జరగలేదు.
ఇదే క్రమంలో పటాన్‌చెరు లో సిట్టింగ్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి సీటు కేటాయించారు. గత రెండు ఎన్నికల్లో ఈయనే బిఆర్‌ఎస్ నుంచి గెలిచారు. అయితే ఈయనకు పెద్ద పాజిటివ్ లేదు. అయినా ఈయనకే సీటు ఫిక్స్ చేశారు. దీంతో సీటు ఆశించిన నీలం మధు ముదిరాజ్ అసంతృప్తికి గురయ్యారు. ఎప్పటినుంచో నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తున్న నీలంకు సీటు దక్కకపోవడంపై బిఆర్‌ఎస్ లో కొందరు ఆగ్రహంతో ఉన్నారు.
పైగా రాష్ట్రంలో ఎక్కడా కూడా ముదిరాజ్ వర్గానికి ఒక్క సీటు కూడా కేటాయించలేదు. పటాన్‌చెరులో అత్యధికంగా ముదిరాజ్ ఓట్లు ఉన్నాయి. దీంతో ఈ సీటు కూడా ఆ వర్గానికి ఇవ్వలేదు. దీంతో నీలం మధు సొంతంగా ముందుకెళ్లడం మొదలుపెట్టారు. బిసి వర్గాలని ఏకతాటిపైకి తీసుకొచ్చి..రానున్న ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా బరిలో దిగడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఆ దిశగా ముందుకెళుతూ..నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తూ ప్రజలకు దగ్గరవుతున్నారు.
అయితే మంచి ఫాలోయింగ్ ఉన్న నాయకుడు కావడంతో కాంగ్రెస్, బిజేపి, బిఎస్‌పి లాంటి పార్టీలు నీలం మధుని తమ పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తున్నాయి. కానీ వేరే పార్టీల్లోకి వెళ్ళే ఉద్దేశంలో మధు కనబడటం లేదు. తన సొంత బలంతోనే ముందుకెళ్లి..పటాన్‌చెరు లో గెలిచి..సత్తా చాటాలని చూస్తున్నారు. తన సొంత వర్గం ముదిరాజ్‌తో పాటు ఇతర బిసి వర్గాలు, దళిత, మైనారిటీ వర్గాలు మద్ధతుగా నిలుస్తాయని ఆశిస్తున్నారు. మొత్తానికి నీలం మధు ఇండిపెండెంట్ గా బరిలో దిగితే పటాన్‌చెరు లో కారుకు ఎదురుదెబ్బ తప్పదు.