పరిటాల వర్సెస్ ప్రకాశ్.. రంజుగా రాప్తాడు రాజకీయం..!

రాయలసీమలో నిత్యం వైసీపీ-టీడీపీల మధ్య రాజకీయ యుద్ధం జరిగే స్థానం ఏదైనా ఉందంటే అది రాప్తాడు మాత్రమే. రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో మిగతా స్థానాల్లో ఈ స్థాయిలో వార్ నడవదు అని చెప్పొచ్చు. కానీ రాప్తాడులో మాత్రం తీవ్ర స్థాయిలో వార్ జరుగుతుంది. ఏకంగా ఫ్యాక్షన్ గొడవలు మాదిరిగా రాజకీయం ఉంటుంది. ఇక్కడ పరిటాల శ్రీరామ్ వర్సెస్ తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి మధ్య మాటల యుద్ధం ఎప్పుడు తీవ్రంగానే ఉంటుంది.

గత ఎన్నికల్లో శ్రీరామ్ మీద ప్రకాశ్ రెడ్డి గెలిచిన విషయం తెలిసిందే. ఇక అప్పటినుంచే రాప్తాడుపై మళ్ళీ పట్టు సాధించాలని శ్రీరామ్..తన పట్టు జారిపోకుండా చూసుకోవాలని ప్రకాశ్ గట్టిగానే పోరాడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతూ ఉంటుంది. తాజాగా కూడా వీరి మధ్య పెద్ద రచ్చ నడిచింది. ఇప్పటికే పరిటాల ఫ్యామిలీపై ఎమ్మెల్యే ప్రకాశ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వస్తున్నారు. పరిటాల ఆస్తులపై ఆరోపణలు చేస్తున్నారు. అలాగే రక్తచరిత్ర ఫ్యామిలీ అంటూ విరుచుకుపడ్డారు. ప్రభుత్వం ఇచ్చిన గన్‌మెన్లు లేకపోతే పరిటాల ఫ్యామిలీ గుమ్మ దాటి బయటకు రాలేదని ప్రకాష్ ఫైర్ అవుతున్నారు.

ఇక ప్రకాశ్‌కు పరిటాల శ్రీరామ్ కూడా గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. అసలు ఫ్యాక్షనిజానికి ఆజ్యం పోసిందే మీ నాయన, మీ అన్నదమ్ములు అంటూ..ప్రకాశ్‌పై శ్రీరామ్ ఫైర్ అయ్యారు. అలాగే ఎన్నికల ముందు ఇల్లు కూడా అమ్ముకోవాలని చూసిన ప్రకాశ్..ఇప్పుడు కోట్ల ఎలా పడగెత్తారో తెలుసని కౌంటర్ ఇచ్చారు. అలాగే ఎన్నికల్లో దొంగ ఓట్లతో ఎలా గెలిచారో తెలుసని, ఇక గన్‌మెన్లు లేకుండా వస్తే ఎవరి సత్తా ఏంటో తేలిపోతుందని, గన్‌మెన్ లేకుండా బయటకు రావడానికి తాము రెడీ అని, మీరు రెడీనా? అంటూ ప్రకాశ్‌కు శ్రీరామ్ సవాల్ విసిరారు. ఇలా ఇరువురి మధ్య వార్ నడుస్తోంది. ఇక ఎన్నికల్లో కూడా రాప్తాడులో ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ నడిచేలా ఉంది.