ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా బోర్డర్‌లో, గ్రేటర్ హైదరాబాద్‌కు దగ్గరగా ఉండే షాద్‌నగర్ నియోజకవర్గం రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ కంచుకోట. నియోజకవర్గం ఏర్పడిన దగ్గర నుంచి ఇక్కడ కాంగ్రెస్ హవా నడుస్తోంది. 1952 నుంచి 1983 వరకు వరుసగా కాంగ్రెస్ గెలిచింది. 1985లో టిడిపి గెలవగా, 1989లో మళ్ళీ కాంగ్రెస్ గెలిచింది. పి.శంకర్ రావు కాంగ్రెస్ నుంచి రెండోసారి గెలిచారు.
మళ్ళీ 1994లో టిడిపి విజయం సాధించింది. ఇక 1999, 2004 ఎన్నికల్లో పి శంకర్ రావు కాంగ్రెస్ నుంచి గెలిచారు. 2009లో కాంగ్రెస్ నుంచి ప్రతాప్ రెడ్డి గెలిచారు. ఇక 2014, 2018 ఎన్నికల్లో వరుసగా బిఆర్‌ఎస్ గెలిచింది. అంజయ్య యాదవ్ వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ఇక ఈ సారి ఎన్నికల్లో కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని అంజయ్య చూస్తున్నారు. కానీ ఆయనకు పోటీగా మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి సైతం సీటు ఆశిస్తున్నారు. 2009లో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఈయన..2014, 2018 ఎన్నికల్లో ఓడిపోయారు. తర్వాత కాంగ్రెస్ పార్టీని వదిలేసి..బిఆర్‌ఎస్ లో చేరారు.
అయితే రెండుసార్లు గెలిచిన అంజయ్యకు నియోజకవర్గంపై పట్టు ఉంది. ఆర్థిక బలం ఉంది. అటు సొంత సామాజికవర్గం మద్దతు ఉంది. కానీ వయస్సు మీద పడటం, ఆయన వారసుల వ్యవహార శైలి, అవినీతి ఆరోపణలు మైనస్‌గా ఉన్నాయి. తాజా సర్వేల్లో షాద్‌నగర్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలుస్తోంది.
అటు ప్రతాప్ రెడ్డికి రాజకీయ అనుభవం ఉంది..ఆర్ధిక బలం ఉంది. కాకపోతే ప్రజలకు పెద్దగా అందుబాటులో ఉండరనే విమర్శలు ఉన్నాయి. అటు కాంగ్రెస్ నుంచి బీర్లపల్లి శంకర్ రేసులో ఉన్నారు. ఎస్సీ-ఎస్టీ ఓట్లు ఎక్కువ ఉండటం, కాంగ్రెస్ కంచుకోట కావడం శంకర్‌కు ప్లస్. మొత్తానికి ఈ సారి షాద్‌నగర్లో బిఆర్‌ఎస్,కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు జరిగే ఛాన్స్ ఉంది. ఎవరైనా తక్కువ మెజారిటీతోనే గెలిచి బయటపడతారు.