దేశవ్యాప్తంగా యూపీఏ, ఎన్డీయేతర కూటమి ఏర్పాటుకు ప్రాంతీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. దీని కోసం అన్ని పార్టీలు ఏకమవుతున్న వాతావరణం కనిపిస్తోంది. ఇప్పటికే థర్డ్ ఫ్రంట్ దిశగా బెంగాల్ సీఎం, మమతాబెనర్జీతో పాటు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు తను సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే కేసీఆర్ పలు మార్లు వ్యాఖ్యలు చేశారు.
కొత్త ఫ్రంట్ కు తెరవెనక ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్ కిషోర్ సలహాల మేరకే బెంగాల్ కే పరిమితమైన త్రుణమూల్ కాంగ్రెస్ పార్టీని జాతీయ పార్టీగా మార్చే క్రమంలో గోవా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారనేది సుస్పష్టం. ఇప్పటికే త్రిపురలో త్రుణమూల్ కాంగ్రెస్ పార్టీని బలపరిచే దిశగా పీకే సలహాలను మమతాబెనర్జీ తీసుకుంటున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా బీహార్ సీఎం, జేడీయూ అధినేత నితీష్ కుమార్ తో ప్రశాంత్ కిషోర్ శుక్రవారం రాత్రి సమావేశం అయ్యారు. గతంలో జేడీయూ ఉపాధ్యక్షుడిగా ఉన్న పీకేని.. ఉన్నపలంగా నితీష్ కుమార్ తీసేశారు. అది అప్పట్లో సంచలనం కలిగించింది. ఇదిలా ఉంటే తాజాగా వీరిద్దరు భేటీ అవ్వడం… థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు సన్నాహకాలు మొదలయ్యాయా అనే వాదనలు తెరపైకి వస్తున్నాయి. ప్రస్తుతం ఎన్డీయే లో భాగస్వామ్య పక్షంగా ఉంది జేడీయూ. గతంలో కేంద్ర మంత్రి మండలిలో సరైన ప్రాతినిథ్యం దక్కలేదు. ఇదిలా ఉంటే ప్రశాంత్ కిషోర్ మాత్రం మర్యాదపూర్వకంగానే కలిశానని.. గతంలో ఉన్న అనుబంధం కారణంగానే కలిశానని చెబుతున్నాడు. అయతే తాను నితీష్ కుమార్ తో మళ్లీ పనిచేయాలనుకుంటున్నా.. అని తన మనసులో మాటను బయటపెట్టాడు.
మరోవైపు నేడు కేసీఆర్ మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో పాటు, ఎన్సీపీ నేత శరద్ పవార్ ను కూడా కలవబోతున్నారు. ఇప్పటికే మమతా బెనర్జీ, స్టాలిన్, దేవెగౌడ వంటి నేతలు కేసీఆర్ తో ఫోన్ లో ముచ్చటించారు.
ఇదిలా ఉంటే జాతీయ పార్టీలుగా ఉన్న బీజేపీ, కాంగ్రెస్ లేకుండా.. దేశంలో అధికారంలోకి రావడం అంటే అసాధ్యం అని చాలా మంది బావిస్తున్నారు. బీజేపీని అడ్డుకోవాలంటే.. కాంగ్రెస్ సాయం తప్పనిసరి అని గతంలో చాలా మంది నాయకులు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. అయితే జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ మాత్రం రాహుల్ గాంధీని పీఎం చేయాలని భావిస్తోంది. కాగా ప్రాంతీయ పార్టీల ఆధిపత్యాన్ని కాంగ్రెస్ అంగీకరిస్తుందా.. అనేది సందేహం. రానున్న కాలంలో దేశ రాజకీయాలు ఎటువంటి మలుపు తిరుగుతాయో చూడాలి.