తిరుపతి ఎంపిగా ఉన్న బల్లి దుర్గాప్రసాద్ సెప్టెంబరు 16న మృతిచెందారు. మార్చి 16వ తేదీకి సరిగ్గా ఆరునెలలు పూర్తయ్యాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఏప్రిల్ 17న పోలింగ్ జరుగుతుందంటూ 16వ తేదీన ప్రకటన ఇచ్చింది. ఇటువంటి తరుణంలో తిరుపతి లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుందా? లేదా? ఇప్పుడు అందరినీ తొలిచేస్తున్న ప్రశ్న ఇదే. రాజ్యాంగం ప్రకారం ఏదైనా లోక్‌సభ స్థానానికికానీ, శాసనసభ స్థానానికి కానీ ఉప ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే ఆరునెలల్లోగా ప్రక్రియ పూర్తికావాలి.
షెడ్యూల్ ఇవ్వకుండా తాత్సారం
తాజాగా జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, తమిళనాడులోని కన్యాకుమారి, కేరళలోని మలప్పురం లోక్ సభ నియోజకవర్గాలకు ఎన్నికల సంఘం గతంలోనే షెడ్యూల్ ప్రకటించించింది. తిరుపతి వాయిదా వేసింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో సంబంధం లేకుండా ఆ రెండు లోక్‌సభ నియోజకవర్గాలకు ఈసీ ప్రత్యేక నోటిఫికేషన్ జారీచేసింది. దీంతోపాటే తిరుపతికి కూడా నోటిఫికేషన్ వస్తుందనుకున్నా రాలేదు. ఆ సమయంలోనే తిరుపతి గురించి ప్రశ్నిస్తే కేంద్ర ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా సరైన సమాధానం చెప్పకుండా దాటవేశారు. సహచర కమిషనర్ చెబుతారంటూ తప్పుకున్నారు.
రాజ్యాంగంతో ఆటలాడుతున్నారు
తాజాగా తిరుపతి లోక్‌సభ స్థానానికి, నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి కలిసి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఏప్రిల్ 17న పోలింగ్ జరుగుతుందని, మే 2న ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపింది. మార్చి 16వ తేదీకి ప్రక్రియ మొత్తం పూర్తయి ఎన్నికైన అభ్యర్థులు చట్టసభల్లో అడుగుపెట్టివుండాలి. కానీ ఇంతవరకు ఎన్నికే నిర్వహించలేదు. మే 2వ తేదీకి లెక్కించినా 47 రోజులు ఆలస్యమవుతుంది. కోర్టులో దీనిపై సవాల్ చేస్తే కేసు ఎంతవరకు నిలబడుతుందనేది అనుమానమే. ఎవరి ఒత్తిడిమేరకు తిరుపతి లోక్‌సభ స్థానం ఉప ఎన్నికను వాయిదా వేశారో ఎన్నికల సంఘానికే తెలియాలి. ఆ వాయిదాతోనే ఇప్పుడు రాజ్యాంగంతో చెలగాటమాడుతున్నారు. దేశంలోని వ్యవస్థలన్నీ నిర్వీర్యమవుతున్నాయని ఆరోపణలొస్తున్న తరుణంలో ఈసీ ఏవిధంగా స్పందిస్తుందో వేచిచూడాలి!!.