సాగర్ బైపోల్: పోస్టల్‌ ఓట్లపై ఫోకస్ పెట్టిన టీఆర్ఎస్,కాంగ్రెస్

నాగార్జునసాగర్‌ ఉపఎన్నికలో ప్రధాన పార్టీలు హోరాహోరీగా తలపడుతుండటంతో ప్రతి ఓటు కీలకంగా మారింది. పోలింగ్‌ సమయం దగ్గరపడుతున్న కొద్దీ నాగార్జునసాగర్‌లో పార్టీలు చురుకుగా తమ ప్రణాళికలను అమలు చేస్తున్నాయి. ప్రతి ఓటు కీలకమైందిగా భావిస్తున్న టీఆర్ఎస్,కాంగ్రెస్ నేతలు పోస్టల్‌ ఓట్ల పై ఫోకస్ పెట్టారు. ఉద్యోగులతో పాటు కోవిడ్‌ కారణంగా వృద్ధులు, వికలాంగులకు కూడా పోస్టల్ ఓటు సౌకర్యం కల్పించడంతో ఈ ఓట్లే ఇప్పుడు సాగర్ ఉపఎన్నికలో కీలకంగా మారాయి.


సాధారణంగా నియోజకవర్గానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల విధుల్లో ఉంటే.. పోస్టల్‌ బ్యాలెట్‌కోసం దరఖాస్తు చేసుకుని వాటిని పొంద వచ్చు. ఈ దఫా కోవిడ్‌ కారణంగా వృద్ధులు, వికలాంగులు పోలింగ్‌ కేంద్రాలకు రాకుండా పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం కల్పించింది ఎన్నికల సంఘం. నాగార్జునసాగర్‌లోని 2 లక్షల 19 వేల మంది ఓట్లర్లలో వృద్ధులు, వికలాంగులు దాదాపు 8 వేల మంది ఉంటే.. పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం 1433 మందే దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఓట్లను పొందేందుకు అధికారపార్టీ మిగతా పక్షాల కంటే ముందుగానే అలర్ట్ అయినట్టు చెబుతున్నారు. ఈ పోస్టల్‌ బ్యాలెట్లను గంపగుత్తగా టీఆర్‌ఎస్‌కు పడేట్టు ప్లాన్‌ వేశారట.

గ్రామాల వారీగా వృద్ధులు, వికలాంగులకు ఇచ్చిన పోస్టల్‌ బ్యాలెట్లను ఇప్పటికే టీఆర్‌ఎస్‌ గుర్తించినట్టు తెలుస్తోంది. చాలామంది అధికార పార్టీ నేతలు ఆ వేటలోనే ఉన్నారట. కాంగ్రెస్‌, బీజేపీల కంటే ముందు ఆయా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటర్ల ఇంటి దగ్గర వాలిపోయి ఓటుకు రేటు కట్టేస్తున్నట్టు తెలుస్తుంది. ఇవి కాకుండా ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలెట్ల పై కూడా పార్టీలు ఓ కన్ను వేశాయి. 2018 ఎన్నికల్లో ఉద్యోగులకు 751 పోస్టల్‌ బ్యాలెట్లు ఇవ్వగా.. పోలైన ఓట్లలో 708 ఓట్లే చెల్లుబాటు అయ్యాయి. వీటిలో టీఆర్‌ఎస్‌ కంటే ఓడిన కాంగ్రెస్‌ అభ్యర్థి జానారెడ్డికే ఎక్కువ పోస్టల్ ఓట్లు పడ్డాయి. జానారెడ్డికి 375, నోములకు 305 పోస్టల్‌ ఓట్లు వచ్చాయి.

ప్రచారానికి, ఊరేగింపులకు జనాలను తరలించడానికి ఇప్పటికే కోట్లు కుమ్మరించిన నేతలు పోస్టల్‌ బ్యాలెట్లను తమకు అనుకూలంగా వేయించుకునే పనిలో పడ్డారు. ఈసారి పోటీ హోరాహోరీగా ఉండటంతో రేటు కూడా బాగానే పలుకుతున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి పోలింగ్‌ కంటే ముందే పోస్టల్‌ బ్యాలెట్లకు గిరాకీ పెరగడంతో సాగర్‌ పోరులో పార్టీల ఎత్తుగడలు ఆసక్తిగా మారాయి.