అధ్యక్ష పీఠం..రాహుల్ ఒప్పుకుంటారా..!

-

ఎక్కువ కాలం దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ పరిస్తితి..ప్రస్తుతం చాలా ఘోరంగా ఉన్న విషయం తెలిసిందే. గత రెండు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ దారుణమైన ఓటములు మూటగట్టుకుని పూర్తిగా దెబ్బతింది. మోదీ-అమిత్ షా ద్వయం దెబ్బకు కాంగ్రెస్ దేశంలో వీక్ అవుతూ వస్తుంది. ఆఖరికి అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సైతం అధికారం కోల్పోతూ వస్తుంది. ఇలా కాంగ్రెస్ పరిస్తితి అగమ్యగోచరంగా ఉంది..దీంతో పార్టీని నిలబెట్టే నాయకుడు కావాలని ఆ పార్టీ శ్రేణులు ఎదురుచూస్తున్నాయి.

కానీ కాంగ్రెస్ భావితర నాయకుడైన రాహుల్ గాంధీ..అధ్యక్ష పీఠాన్ని అధిరోహించడానికి ఇష్టపడటం లేదు. కొన్ని రోజులు అధ్యక్షుడు స్థానంలో ఉన్నా తర్వాత రాజీనామా చేసి..పక్కకు తప్పుకున్నారు. దీంతో సోనియా గాంధీ మళ్ళీ పార్టీ బాధ్యతలని భుజాన వేసుకున్నారు. అయితే రాహుల్ గాంధీని అధ్యక్ష బాధ్యతలు తీసుకోవాలని చాలామంది సీనియర్ నేతలు ఒప్పించడానికి ప్రయత్నించారు. కానీ రాహుల్ మాత్రం ససేమిరా ఒప్పుకోవడం లేదు.

ఈ క్రమంలోనే సోనియా గాంధీ..అధ్యక్ష పీఠానికి ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధమయ్యారు. అలాగే సీనియర్ నాయకుడు..రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌ని అధ్యక్ష రేసులోకి తీసుకొచ్చారు. అధికారికంగా ఆయన్నే అధ్యక్షుడుగా నిలబెట్టాలని కాంగ్రెస్ ఫిక్స్ అయింది. ఇదే క్రమంలో తాను పోటీకి నిలబడతానని కేరళకు చెందిన ఎంపీ శశిథరూర్ ప్రకటించారు. దీనికి సోనియా గాంధీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలని..అధ్యక్షుడు ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేయొచ్చని క్లారిటీ ఇచ్చారు.

ఈ క్రమంలోనే మరో సీనియర్ దిగ్విజయ్ సింగ్ సైతం పోటీకి రెడీ అయ్యారు. అయితే అందరూ మాత్రం రాహుల్ గాంధీని అధ్యక్ష పదవి తీసుకోవాలని కోరుతున్నారు. ఇప్పటికే భారత్ జోడో యాత్రతో దూసుకెళుతున్న రాహుల్‌ని ఒప్పించడానికి సీనియర్లు ప్రయత్నిస్తున్నారు. అధ్యక్షుడు రేసులో ఉన్న అశోక్ గెహ్లాట్ కూడా..రాహుల్‌ని కలిసి ఆయన్ని ఒప్పించే ప్రయత్నం చేయాలని చుస్తున్నారు. అలాగే అన్నీ రాష్ట్రాల పీసీసీలు సైతం రాహుల్‌ అధ్యక్ష పగ్గాలు చేపట్టాలంటూ ఏకగ్రీవ తీర్మానాలు చేస్తూనే ఉన్నాయి. తాజాగా తెలంగాణ, పంజాబ్ పీసీసీలు కూడా రాహుల్‌ అధ్యక్ష పదవి చేపట్టాలని తీర్మానించాయి. మరి అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి రాహుల్ అంగీకరిస్తారో లేక మళ్ళీ 20 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అధ్యక్షుడు పదవికి ఎన్నికలు జరుగుతాయేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news