నిజమే.. ఎందుకిలా నా ఖర్మ కాలిపోయింది. అని వైసీపీ ఎంపీ ఒకరు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి కూడా దూరంగా ఉండాలని భావిస్తున్నారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఆ నాయకుడు.. మంచి విద్యావేత్త. రాజకీయంగా బలమైన నాయకుడు కూడా. ఎన్నో ఆశలతో వైసీపీలో కొనసాగుతున్నారు. కానీ, ఆయన ఆశలు ఏవీ నెరవేరలేదట. కనీసం.. ఆయన చెప్పిన మాటను బంట్రోతు కూడా వినే పరిస్థితి లేకుండా పోయిందనే వాదన వినిపిస్తోంది.
ఇంతకీ ఆయ యువ ఎంపీ ఎవరంటే.. కోటగిరి శ్రీధర్. తండ్రి కోటగిరి విద్యాధరరావు వారసుడిగా రాజకీయ అరగేంట్రం చేసిన ఈయన వ్యక్తిగతంగా సీఎం జగన్‌కు అభిమాని. తర్వాత.. వైసీపీలోనూ చేరి.. పార్టీ పరంగా కూడా ఆయన బాగానే పనిచేశారు. ఈ క్రమంలోనే టీడీపీకి కంచుకోట వంటి ఏలూరు పార్లమెంటు నియోజక వర్గం నుంచి ఆయన పోటీ చేసి రాజకీయ యోధుడిగా పేరున్న టీడీపీ సీనియర్ నాయకుడు మాగంట వెంకటేశ్వరరావు ఉరఫ్ బాబుపై విజయం దక్కించుకున్నారు.
ఇక, శ్రీధర్ విషయానికి వస్తే.. ఆయన ఎంపీగా గెలిచినప్పటి నుంచి కూడా.. మంచిగానే పార్టీతోనూ.. నాయ కులతోనూ.. స్థానిక నియోజకవర్గంలోనూ సమ్మిళతమై పనిచేస్తున్నారు. అంతేకాదు.. పర్యావరణ ప్రేమికు డిగా కూడా.. చెట్లు నాటడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేలా ప్రజలకు అవగాహన కల్పించడం వంటి అంశాలపై కృషి చేస్తున్నారు. ఇక, ఎంపీ లాడ్స్ నిధులతో అభివృద్ధి పులు కూడా చేపడుతున్నారు. కానీ, ఏమైందో ఏమో అనూహ్యంగా ఆయన నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు.
నియోజకవర్గంలో తన మాట ఎవరూ వినడం లేదని.. తనను కనీసం ప్రోటోకాల్ ప్రకారం కూడా కార్యక్ర మాలకు ఆహ్వానించడం లేదని.. ఆయన వగరుస్తున్నారు. స్థానికంగా మారిన పరిణామాల నేపథ్యంలో అన్నీ ఎమ్మెల్యేలు చూసుకుంటున్నారని కూడా ఎంపీ ఆవేదనతో ఉన్నారని సమాచారం. తన లోక్‌సభ పరిధిలో ఎంపీగా ఉనికే లేదనే ఆవేదన కోటగిరి శ్రీధర్‌లో స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీకి కూడా దూరంగా ఉండాలని భావిస్తున్నట్టు సమాచారం. మరి ఈ విషయంపై పార్టీ అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.