నాలుగో సిద్ధం సభకు రెడీ అవుతోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.ఇప్పటికే మూడు ప్రాంతాల్లో మూడు సభలను పూర్తి చేసింది. రాయలసీమకు సంబంధించి నిర్వహించిన రాప్తాడు సభలో సుమారు పది లక్షల మందికిపైగా ప్రజలు, కార్యకర్తలు, పార్టీ నేతలు హాజరయ్యారు. అయితే నాలుగో సిద్ధం సభకు డేట్ ఫిక్స్ చేసింది వైసీపీ. ఈ సభను రాప్తాడు తరహాలో భారీ ఎత్తున నిర్వహించేందుకు అధికార పార్టీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాప్తాడు సభతో వైసీపీ కేడర్‌లో ఉత్సాహం పెరిగిందని, దాన్ని కొనసాగించేలా ఈ సభను నిర్వహించనున్నట్టు వైసీపీ నేతలు చెబుతున్నారు. కనీసం ఐదు లక్షల మందితో నాలుగో ysrcpనిర్వహించాలని వైసీపీ భావిస్తోంది.
పల్నాడు ప్రాంతo వేదికగా మార్చ్ 3వ తేదీన నాలుగో సిద్ధం సభ నిర్వహించేందుకు వైసీపీ ప్లాన్ చేసింది.బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం పరిధిలోని మేదరమెట్లలను సభ కోసం ఎంపిక చేసింది. ఈ సభకు గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి పార్లమెంట్ల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ప్రజలను తరలించేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు.సభ ఏర్పాట్లపై తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు,సమన్వయకర్తలతో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. 54 నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు ఈ సభకు వచ్చేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయo తీసుకున్నారు.ఇందుకోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.
పల్నాడులో నిర్వహించే సిద్ధం సభ చివరిదని వైసీపీ వర్గాలు అంటున్నారు.దీంతో ప్రత్యేకత సంతరించుకున్న ఈ సభపై అందరికీ ప్రత్యేక ఆశక్తి నెలకొంది.సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ-జనసేన కూటమి మేనిఫెస్టోని ఇప్పటికే ప్రకటించింది.అయితే వైసీపీ 2019 మేనిఫెస్టోనే మళ్లీ కొనసాగిస్తుందా లేక కొత్త మేనిఫెస్టో ప్రకటిస్తుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.పల్నాడులో నిర్వహించే చివరి సిద్ధం సభలో మేనిఫెస్టోను ప్రకటిస్తారని సీఎంపై ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. ఇదే చివరి సిద్ధం కావడంతో కేడర్‌కు దిశా, నిర్ధేశం చేయడంతోపాటు మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేయబోతామన్న దానిపై సీఎం ప్రకటన చేసే అవకాశo ఉందని వైసీపీ నేతలు చెబుతున్నారు.అలా చేస్తేనే మేలు జరుగుతుందని విశ్లేషకులు అంటున్నారు.