తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం పొన్నియన్ సెల్వన్-1. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియన్ సెల్వన్’ నవల ఆధారంగా మణిరత్నం ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందిస్తున్నాడు. కాగా మొదటి భాగం సెప్టెంబర్ 30న విడుదల కానుంది.
ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేయగా.. ఇటీవలే విడుదలైన ట్రైలర్ ఆ అంచనాలను రెట్టింపు చేశాయి. ఇక ఎప్పుడెప్పుడు బిగ్ స్క్రీన్‌పై మణిరత్నం మ్యాజిక్‌ను చూద్దామా అని ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
పొన్నియన్ సెల్వన్’ చిత్రానికి సంబంధించిన డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు కొనుగోలు చేసిందట. కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం పొన్నియన్ సెల్వన్ రెండు పార్ట్‌లకు కలిపి ప్రైమ్ వీడియో సంస్థ సుమారు రూ.125 కోట్లకు కొనుగోలు చేసిందట. ఇంకా మొదటి భాగం విడుదల కాకముందే ఈ స్థాయిలో డిజిటల్ హక్కులు అమ్ముడయ్యాయంటే విశేషం అనే చెప్పాలి. ఇక ఇప్పటికే ఈ సినిమా ఆడియో హక్కులు రూ.20 కోట్లకు అమ్ముడయ్యాయి. రోజు రోజుకు ఈ చిత్రంపై క్రేజ్ పెరుగుతూనే ఉంది.
చియాన్ విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష, బాబీ సింహా వంటి స్టార్లు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి స్వర మాంత్రికుడు ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. లైకా ప్రొడక్షన్స్ సంస్థతో కలిసి మద్రాస్ టాకీస్ బ్యానర్‌పై మణిరత్నం స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.