కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా సోనియాగాంధీపై కీలక వ్యాఖ్యలు చేశారు. సోనియా గాంధీ మొదట్లో భారతీయ
సంప్రదాయాలకు అలవాటుపడటానికి చాలా కష్టపడ్డారని ఆమె కుమార్తె ప్రియాంకా గాంధీ అన్నారు. తన తల్లికి రాజకీయాలు ఇష్టం లేనప్పటికీ దేశ సేవ చేసేందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నారని అన్నారు కర్ణాటకలో మేలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నిర్వహించిన మహిళా సదస్సులో ప్రియాంక పాల్లొన్నారు. ఇద్దరు (ఇందిరా గాంధీ, సోనియా గాంధీ) ధైర్యవంతులు, బలమైన మహిళల పెంపకంలో తాను పెరిగానన్నారు.
ఇందిరాగాంధీ తన 33 ఏళ్ల కొడుకును పోగొట్టుకున్నప్పుడు తన వయసు ఎనిమిదేళ్లని ప్రియాంక గుర్తు చేసుకున్నారు. సంజయ్ గాంధీ మరణించిన మరుసటి రోజే, ఇందిరా దేశానికి సేవ చేయడానికి వెళ్లారని, అది ఆమె కర్తవ్యమని చెప్పారని అన్నారు. ఇందిరా గాంధీ చనిపోయే వరకు దేశానికి సేవ చేస్తూనే ఉన్నారని ప్రియాంక చెప్పారు. సోనియా గాంధీ 21 ఏళ్ల వయసులో రాజీవ్ గాంధీతో ప్రేమలో పడ్డారని, 44 సంవత్సరాల వయస్సులో ఆమె తన భర్తను కోల్పోయిందని చెప్పారు ప్రియాంకా గాంధీ.