ఉక్రెయిన్​-రష్యా యుద్ధం.. పుతిన్ కీలక ప్రకటన

-

ఉక్రెయిన్​పై యుద్ధంలో ఎదురుదెబ్బ తిని నెమ్మదిగా అక్కడి నుంచి తన సైన్యాన్ని తరలిస్తున్న రష్యా మరో అటాక్​కు రెడీ అవుతోందా..? తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేసిన ప్రకటన చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తోంది. ఉక్రెయిన్​పై యుద్ధాన్ని కొనసాగించడానికి.. ఇంతకుముందు కంటే రెట్టింపు వేగంతో.. డబుల్ పవర్​తో ఉక్రెయిన్​ సేనలను నేలమట్టం చేయడానికి పక్కా వ్యూహాన్ని రచిస్తోంది.

యుద్ధాన్ని కొనసాగించేందుకు ప్రజలను, ఆర్థిక వ్యవస్థనూ సన్నద్ధంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు పుతిన్ చేసిన ప్రకటన మరోసారి పశ్చిమ దేశాల్లో గుబులు రేపుతోంది. ముందుగానే రికార్టు చేసిన ఓ ప్రకటనను రష్యా ప్రభుత్వ వర్గాలు బుధవారం విడుదల చేశాయి. ఇందులో పుతిన్ మాట్లాడుతూ పశ్చిమ దేశాలు రష్యాను నాశనం చేయాలనుకుంటున్నాయని ఆరోపించారు. ఇందుకు ఉక్రెయిన్‌ ప్రజలను ఆయుధంగా వాడుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. రష్యాతో పరోక్ష యుద్ధాన్ని ప్రారంభించినందుకు పశ్చిమ దేశాలను ఆయన నిందించారు.

విముక్త ప్రదేశాల్లో ప్రజలను కాపాడేందుకు అత్యవసరంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పుతిన్‌ తెలిపారు. అందుకే పాక్షిక సైనిక సమీకరణ చేపట్టేందుకు రక్షణ శాఖ అంగీకరించాలని కోరుతున్నానన్నారు. ఇప్పటికే డిక్రీపై సంతకాలు చేసినట్లు వెల్లడించారు. ఈ సమీకరణ కింద చేరే వారికి పూర్తిస్థాయి సైనిక దళాల హోదా లభిస్తుందన్నారు. ఈ సైనిక సమీకరణ నేటి నుంచే మొదలవుతుందని తెలిపారు. పశ్చిమ దేశాలు రష్యాపై అణు బెదిరింపులకు పాల్పడుతున్నాయని పుతిన్‌ ఆరోపించారు. అయితే.. దీనిపై స్పందించేందుకు మాస్కో వద్ద చాలా ఆయుధాలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. తమ ప్రజలను రక్షించుకోవడానికి అన్ని వనరులు వినియోగిస్తామని తేల్చి చెప్పారు.

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రకటనపై బ్రిటన్‌ మంత్రి గిల్లియాన్‌ కీగన్‌ స్పందిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమ దేశాలను భయపెట్టేలా చాలా ఆయుధాలు ఉన్నాయంటూ పుతిన్‌ పేర్కొన్నారన్నారు. రష్యా అదనపు దళాలను సమీకరించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. పుతిన్‌ ప్రకటనను తీవ్రంగా పరిగణించాలన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version