రోజుకో క్వార్టర్ మందు, సిగరెట్ తాగుతా.. టీచర్లకు స్టూడెంట్ లేఖ..!

-

విద్యార్థి చిన్నవయసులోనే చెడు వ్యసనాలను బానిసయ్యాడని తెలిసి అతడ్ని దారిలో పెట్టే ప్రయత్నం చేశారు ఓ ప్రభుత్వ స్కూల్లోని టీచర్లు. కానీ అతడు ఇచ్చిన సమాధానంతో వారికి కరెంట్ షాక్ కొట్టినంత పనైంది. గురువులంటే పిల్లలకు విద్యాబుద్ధులతో పాటు సంస్కారం, మంచి అలవాట్లను నేర్పిస్తారు. చెడుమార్గంలో వెళ్తుంటే దండించైనా దారిలో పెడతారు.

 

వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని తూర్పు గోదావరి జిల్లా (East Godavari District) లోని ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థి ఇటీవల మద్యం తాగి ఆ మత్తులోనే స్కూల్ కి వచ్చాడు. అతడి ప్రవర్తన తేడా ఉండటంతో గమనించిన ఉపాధ్యాయులు తండ్రిని పిలిపించి మందలించారు.

మీ అబ్బాయి ప్రవర్తన సరిగా లేదని బుద్ధి చెప్పాలన్నారు. ఐతే బాలుడి తండ్రి కూడా తన మాట వినడం లేదని.. మీరైనా చెప్పి వాడిని మార్చండి అంటూ చెప్పి వెళ్లిపోయాడు. దీంతో టీచర్లు ఆ విద్యార్థిని వివరణ కోరారు. అందులో అతడు రాసిన విషయాలు చూసి టీచర్లకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. తాను రోజుకి క్వార్టర్ మందు కొడతానని..

అలాగే స్కూల్ కి సమీపంలోని ఓ షాపులో సిగరెట్లు కొనుక్కొని కాల్చుతున్నానని.. పి.గన్నవరంలోని ప్రభుత్వ వైన్ షాపులో మద్యం కొనుకొని తాగుతున్నానన్నాడు. అంతేకాదు మద్యం కొనుక్కునేందుకు ఇటుకల బట్టీలో పనికి వెళ్తున్నానని.. ఇకపై ఇలా చేయను అని లేఖలో పేర్కొన్నాడు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇదే స్కూల్లో మరో ఐదుగురు విద్యార్థులు మందు కొడుతున్నారంట.. ఇదే విషయం తల్లిదండ్రులకు చెబుతుంటే వారిని వెనకేసుకొస్తున్నారని టీచర్లు వాపోతున్నారు.

ఐతే 15ఏళ్లు కూడా లేని బాలుడికి మద్యం ఎలా విక్రయించారు..? అది కూడా ప్రభుత్వ వైన్ షాపులో ఎలా జరిగిందనే చర్చనీయాంశమవుతోంది. గత ఏడాది కర్నూలు జిల్లా ఆత్మకూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. ఐదుగురు విద్యార్థులు స్కూల్లోనే మద్యం సేవించడం కలకలం రేపింది. ఇంట్లోనే మద్యం తాగి వచ్చిన సదరు విద్యార్థి.. బ్యాగులో మద్యం తీసుకెళ్లాడు.

లంచ్ బ్రేక్ లో తన క్లాస్ మేట్స్ తో పాటు మరో 9వ తగతి విద్యార్థి కలిసి మద్యం తాగారు. ఇది చూసిన తోటి విద్యార్థులు విషయాన్ని హెచ్ఎం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారిని మందలించిన ప్రధానోపాధ్యాయులు.. తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చిన అనంతరం అందరికీ టీసీలు ఇచ్చి పంపేశారు. ఐతే మద్యం సేవించడంపై విద్యార్ధి ఇచ్చిన సమాధానంతో అందరూ షాక్ కు గురయ్యారు. తన తండ్రి రోజూ మద్యం తాగుతాడని.. అది చూసి తనకు తాగాలనిపించిందని చెప్పాడు. తెలిసిన వారికి డబ్బులిచ్చి మద్యం తెమ్మని కోరగా తెచ్చారని.. అదే తాను తాగానన్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version