ఏఐసీసీ అగ్ర నేత రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన గురువారమే ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ షాకింగ్ ప్రకటన చేశారు. తాను కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులో లేనంటూ రాహుల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని తాను ఇదివరకే చెప్పానని కూడా గుర్తు చేశారు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ అధ్యక్ష పదవి పోటీకి తాను దూరంగా ఉంటానని కూడా తేల్చి చెప్పారు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ పార్టీకి ఈ దఫా గాంధీయేతర కుటుంబానికి చెందిన వ్యక్తే అధ్యక్షుడు అవుతారని మరో కీలక వ్యాఖ్య చేశారు రాహుల్ గాంధీ.
ప్రస్తుతం తాను చేస్తున్న భారత్ జోడో యాత్రను ఓ సామాన్య పార్టీ కార్యకర్త హోదాలోనే చేస్తున్నానని తెలిపారు రాహుల్ గాంధీ. ఈ వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి పోలింగ్ తప్పనిసరి అని తేలిపోయినట్టేనన్న వాదనలు వినిపిస్తున్నారు. ఇప్పటికే అధ్యక్ష బరిలో నిలిచేందుకు శశి థరూర్, అశోక్ గెహ్లాట్, దిగ్విజయ్ సింగ్ తదితరులు సిద్ధపడగా… మరింత మంది పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.