మరోసారి భాగ్యనగరంలో వరణుడు విహరించాడు. హైదరాబాద్ వ్యాప్తంగా మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. గత నాలుగైదు రోజుల నుంచి నగర వ్యాప్తంగా చల్లని గాలులు వీస్తున్న సంగతి తెలిసిందే. ఆదివారం రాత్రి, సోమ, మంగళవారాల్లో తెల్లవారుజామున వర్షం కురిసింది. మరోసారి మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి భాగ్యనగరం తడిసి ముద్దయింది. మధ్యాహ్నం సమయంలో ఎండ దంచికొట్టింది. నాంపల్లి, కోఠి, అబిడ్స్, లక్డీకాపూల్, ఖైరతాబాద్, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కొండాపూర్, మాదాపూర్, మెహిదీపట్నం, లంగర్ హౌజ్, మలక్‌పేట్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్,
ఫలక్‌నూమా, చార్మినార్, నాచారం, తార్నాక, హబ్సిగూడ, రాంనగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, చిక్కడపల్లి, ముషీరాబాద్, సికింద్రాబాద్, ప్యారడైజ్, బేగంపేట్, సనత్ నగర్‌తో పాటు పలు ప్రాంతాల్లో వాన దంచికొట్టింది. వర్షం కారణంగా హైదరాబాద్ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో పోలీసులు క్రమబద్దీకరించారు. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరింది.