రాష్ట్రంలో మళ్లీ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. శని, ఆదివారాల్లో కూడా పలుచోట్ల అతిభారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ సూచించింది. గురువారం ఉదయం 8.30 నుంచి శుక్రవారం ఉదయం 8.30 గంటల వరకూ 24 గంటల వ్యవధిలో అత్యధికంగా పరిగి(వికారాబాద్ జిల్లా)లో 22, గంగాధర(కరీంనగర్)లో 17.1, మంచిర్యాల జిల్లా తాండూరులో 13.6, హాజీపూర్‌లో 13.4, శాంతాపూర్‌లో 12.5, పాతరాజంపేట(కామారెడ్డి)లో 11.8,
మాగనూర్(నారాయణపేట)లో 10 సెంటీమీటర్ల వర్షం కురిసింది. శుక్రవారం ఉదయం 8.30 నుంచి రాత్రి 8.30 వరకు పలుచోట్ల భారీవర్షాలు కురిశాయి. అత్యధికంగా మధిర(ఖమ్మం)లో 10, గడ్డిపల్లి(సూర్యాపేట)లో 8.7, గూడూరు(జనగామ)లో 8.1 సెం.మీ.ల వర్షం కురిసింది. వికారాబాద్ జిల్లా దోమ మండలం దిర్సంపల్లి సమీపంలో దోమ వాగు దాటుతూ స్థానిక రైతు జావిద్(52) గల్లంతయ్యారు.
ఆదివారం(ఈ నెల 7న) బంగాళాఖాతం పశ్చిమ మధ్య ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది. రాజస్థాన్‌లోని బికనీర్ నుంచి ఛత్తీస్‌గఢ్ మీదుగా బంగాళాఖాతం వరకూ రుతుపవన గాలులతో ద్రోణి ఏర్పడింది. మరోవైపు ఉత్తర కోస్తాంధ్ర తీరం నుంచి బంగాళాఖాతంపై గాలులతో ఉపరితల ఆవర్తనం 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకూ వ్యాపించింది. వీటి ప్రభావంతో తెలంగాణలో కుంభవృష్టిలా వర్షాలు కురుస్తున్నాయి.