ఆప్ సంచలన నిర్ణయం.. పద్మ శ్రీ అవార్డు గ్రహీతలకు రాజ్యసభ సీటు!!

ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పద్మశ్రీ అవార్డులు అందుకున్న ఇద్దరు ప్రముఖ వ్యక్తులను రాజ్యసభకు పంపుతూ కీలక నిర్ణయం తీసుకుంది. పంజాబ్ కోటా నుంచి ఆప్‌కు రెండు రాజ్యసభ సీట్లు కేటాయించారు. దీంతో ఆప్ అసలు పార్టీకి, రాజకీయాలతో సంబంధం లేని అభ్యర్థుల పేర్లను ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. పంజాబీ సంస్కృతి పరిరక్షణకు పాటు పడిన ప్రముఖ పారిశ్రామికవేత్త విక్రమ్ జిత్ సింగ్ సాహ్ని, పర్యావరణ పరిరక్షణకు పాటుపడిన బల్బీర్ సింగ్ సీచేవాల్‌కు రాజ్యసభ సీటు కేటాయించింది.

విక్రమ్ జిత్ సింగ్ సాహ్ని-బల్బీర్ సింగ్ సీచేవాల్‌
విక్రమ్ జిత్ సింగ్ సాహ్ని-బల్బీర్ సింగ్ సీచేవాల్‌

కాగా, ప్రస్తుతం దేశంలోని పలు రాష్ట్రాల్లో రాజ్యసభ సీట్లు ఖాళీ అయ్యాయి. ఇందులో భాగంగా పంజాబ్ కోటాలో ఖాళీ కానున్న సీట్లకు ఆ రాష్ట్ర అసెంబ్లీలోని పార్టీ బలగాల మేరకు ఆప్‌కు రెండు సీట్లు కేటాయించనుంది. ఈ మేరకు సాహ్ని, బల్బీర్ సింగ్ సోమవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. రాజ్యసభ ఎన్నికల ఫలితాలను జూన్ 10వ తేదీన ప్రకటించనున్నారు. దీంతో రాజ్యసభలో ఆప్ బలం 10కి పెరిగింది. అయితే పంజాబ్ నుంచి కాంగ్రెస్ పార్టీకి ఒక్క రాజ్యసభ మెంబర్ కూడా లేకపోవడం గమనార్హం.