రతన్ టాటా గ్రూప్ ను అందనంత ఎత్తుగా తీసుకువెళ్లిన సంగతి తెలిసిందే. అయితే రతన్ టాటా ప్రస్తుతం టాటా సన్స్ అనే సంస్థకు గౌరవ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఆయన వ్యాపార దక్షత, దాతృత్వ సేవల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 85 ఏళ్ల రతన్ టాటా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. స్నేహితులు, ఇతర శ్రేయోభిలాషులను సోషల్ మీడియా వేదికగా పలకరిస్తూ, వివిధ సందర్భాల్లో రతన్ టాటాకు శుభాకాంక్షలు తెలుపుతుంటారు.
ఆయన నుంచి వచ్చే పోస్టులు చాల అరుదు అయినప్పటికీ, ఆయనను లక్షల సంఖ్యలో ఫాలో అవుతుంటారు జనాలు. రతన్ టాటాకు ఇన్ స్టాగ్రామ్ లో 85 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే ఆయన ఫాలో అయ్యేది మాత్రం కేవలం ఒక్కరినే. టాటా గ్రూపు తరఫున సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించే టాటా ట్రస్ట్ ను మాత్రమే ఆయన ఫాలో అవుతుంటారు. టాటా ట్రస్ట్ కార్యకలాపాలు రతన్ టాటా ఆధ్వర్యంలోనే కొనసాగుతుంటాయి. 1919లో ఈ ట్రస్టు ప్రారంభమైంది. భారత్ లోని ప్రాచీన దాతృత్వ సంస్థల్లో ఇది కూడా ఒకటి. ఇక, రతన్ టాటా చివరిసారిగా జనవరి 15న ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. తమ టాటా ఇండికా కారును ఆవిష్కరించి 25 ఏళ్లయిన సందర్భంగా ఆ కారు పక్కన తాను నిలబడి ఉన్న ఫొటోను రతన్ టాటా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.