ప్రజలకు అలర్ట్‌.. రేపటి నుంచి డిజిటల్‌ రూపాయి

-

దేశంలో డిజిటల్‌ రూపాయి వైపు అడుగులు వడివడిగా పడుతున్నాయి. డిసెంబర్‌ 1 నుంచి రిటైల్‌ డిజిటల్‌ రూపాయిని పైలట్‌ ప్రాజెక్ట్‌గా ప్రారంభించబోతున్నారు. ఈ మేరకు నిన్న భారతీయ రిజర్వు బ్యాంకు వెల్లడించింది. దీనినే ఈ-రూపాయిగా కూడా వ్యవహరిస్తారు. ఇందుకోసం ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరు, భువనేశ్వర్‌లోని భారతీయ స్టేట్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యస్ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌‌లతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ ప్రయోగాత్మక ప్రాజెక్టు తొలుత కస్టమర్లు, వ్యాపారులతో కూడిన క్లోజ్డ్ యూజర్ గ్రూప్ (సీయూజీ) కు మాత్రమే అందుబాటులో ఉంటుందని ఆర్‌బీఐ తెలిపింది. చట్టపరమైన టెండర్‌ను సూచించే డిజిటల్ టోకెన్ మరో రూపమే ఈ-రూపాయి. క్రిప్టో కరెన్సీలా కాకుండా పేపర్ కరెన్సీ, నాణేల మాదిరిగానే అదే విలువను కలిగి ఉంటుంది.

డిజిటల్ రుపీ ఎలా పనిచేస్తుంది?
డిజిటల్ రూపాయి (ఈ-రుపీ ) వినియోగదారులు, వ్యాపారులకు బ్యాంకులు వంటి మధ్యవర్తుల ద్వారా పంపిణీ అవుతుంది. బ్యాంకులు అందించే డిజిటల్ వాలెట్ ద్వారా ఈ-రూపాయితో లావాదేవీలు చేసుకోవచ్చు. లేదంటే మొబైల్ ఫోన్లు, ఇతర పరికరాల్లోనూ నిల్వ చేసుకోవచ్చు. అలాగే, వ్యక్తుల నుంచి వ్యక్తుల మధ్య (పీ2పీ) వ్యక్తి-వ్యాపారి (పీ2ఎం) మధ్య డిజిటల్ రుపీతో లావాదేవీలు జరుపుకోవచ్చని రిజర్వు బ్యాంకు తెలిపింది. ప్రస్తుతం ఆన్‌లైన్ లావాదేవీలు జరుగుతున్నట్టుగానే క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేసి కూడా చెల్లింపులు జరుపుకోవచ్చు. భౌతిక నగదు లానే ఇది కూడా భద్రత, సెటిల్‌మెంట్‌ను అందిస్తుంది. అయితే, డిజిటల్ రుపీ మన వాలెట్లలో ఉంటే దానికి వడ్డీ లభించదు. బ్యాంకుల వద్ద డిపాజిట్ల రూపంలో ఉంటే మాత్రమే వడ్డీ లభిస్తుంది.

దశల వారీగా విస్తరణ
పైలట్ ప్రాజెక్టులో భాగంగా ప్రస్తుతం నాలుగు బ్యాంకుల ద్వారా నాలుగు నగరాల్లో మాత్రమే అందుబాటులోకి వస్తున్న డిజిటల్ రుపీని తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ, కోటక్ మహీంద్రా బ్యాంకులకు విస్తరించనున్నట్టు ఆర్‌బీఐ తెలిపింది. అలాగే, మరిన్ని నగరాలకు కూడా విస్తరిస్తారు. అహ్మదాబాద్, గ్యాంగ్‌టక్, గువాహటి, హైదరాబాద్, ఇండోర్, కొచ్చి, లక్నో, పాట్నా, సిమ్లాలకు దశల వారీగా విస్తరిస్తారు. ఆ తర్వాత దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఈ-రుపీని అందుబాటులోకి తీసుకొస్తారు. అయితే, కచ్చితంగా ఎప్పుడు అన్న విషయాన్ని మాత్రం రిజర్వు బ్యాంకు వెల్లడించలేదు.

డిజిటల్ రూపాయిని చలామణిలోకి తీసుకురావడం గురించి రిజర్వు బ్యాంకు చాలా కాలంగా చెబుతోంది. ఈ నేపథ్యంలో రేపటి నుంచి దీనిని అందుబాటులోకి తీసుకొస్తోంది. గురువారం నుంచే వినియోగదారులు ఈ-రుపీతో లావాదేవీలు చేయగలుగుతారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version