మునుగోడులో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం: రేవంత్ రెడ్డి

-

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో… ఆయన వెంట కాంగ్రెస్‌ శ్రేణులు వెళ్లకుండా చూడాలనే లక్ష్యంతో బహిరంగ సభ నిర్వహించింది. చండూర్ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠ‌శాల‌లో నియోజ‌క వ‌ర్గంలోని ఏడు మండ‌లాల నుంచి ముఖ్య కార్యక‌ర్తల‌తో ఈ సభను ఏర్పాటు చేశారు. దీనికి భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి మిన‌హా అంద‌రు నాయ‌కులు హాజ‌ర‌య్యారు.

పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి…. కోమ‌టిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. భుజాల మీద మోసిన పార్టీని, ప్రజలను మోసం చేసిన నయవంచకుడు రాజగోపాల్‌రెడ్డి అని విమర్శించారు. అనారోగ్యంతో సోనియాగాంధీ బాధపడుతుంటే కేంద్రం ఈడీ కేసులతో వేధిస్తున్న సమయంలో కాంట్రాక్టుల కోసం రాజగోపాల్‌రెడ్డి…. అమిత్‌షాను కలిశారని ఆరోపించారు.

మనుగోడు అభివృద్ధి కోసమే రాజీనామా చేశానని చెబుతున్న రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లోనే ఉండి తిరిగి పోటీచేస్తానంటే గెలిపించేవాళ్లమని స్పష్టం చేశారు. భాజపాలో చేరుతున్న రాజగోపాల్‌రెడ్డి మునుగోడు అభివృద్ధి కోసం కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ తెస్తారా? అని ప్రశ్నించారు. జైలుకు వెళ్లిన వచ్చిన వ్యక్తి దగ్గర ఎలా పనిచేస్తాని రాజగోపాల్‌రెడ్డి కొత్తరాగం అందుకున్నారని ఐతే 2014 తర్వాత కేసీఆర్‌పై పోరాటం ప్రారంభించాకే తనపై కేసులు వచ్చాయని తెలిపారు. తాను 30 రోజులు జైలులో ఉండి వ‌స్తే అమిత్ షా ఏకంగా జైలులో 90 రోజులు జైలు జీవితం గ‌డిపార‌ని…ఆయ‌న వ‌ద్ద ఎలా ప‌ని చేస్తారని రాజగోపాల్‌రెడ్డిని ప్రశ్నించారు..

రాజ‌గోపాల్ రెడ్డి పార్టీని వీడినంత మాత్రాన కాంగ్రెస్‌కు నష్టమేమని లేదన్న రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ కార్యక‌ర్తల‌కు అందుబాటులో ఉండి…ఈగ కూడా వాల‌నివ్వబోమ‌ని స్పష్టం చేశారు. మునుగోడు నియోజకవర్గంలోని మండ‌లాల వారీగా నాయ‌కుల‌తో స‌మావేశ‌మై ప‌ల్లె ప‌ల్లె గూడెం గూడెం తిరి పార్టీ బ‌లోపేతానికి కృషి చేస్తాన‌న్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version