రేవంత్ రెడ్డి టార్గెట్ ఫిక్స్…రెండువైపులా పదును పెట్టాల్సిందేనా..!

-

టీపీసీసీగా అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి(Revanth Reddy) ని ప్రకటించిన దగ్గర నుంచి తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య మార్పులు వచ్చిన విషయం తెలిసిందే. మొన్నటివరకు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అనేలాగా రాజకీయాలు ఉండేవి. కానీ ఇప్పుడు రేవంత్ ఎంట్రీతో పరిస్తితి మారింది. కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. రేవంత్, కాంగ్రెస్‌ని మళ్ళీ నిలబెడతారని ఆ పార్టీ శ్రేణులు గట్టిగా నమ్ముతున్నాయి.

అందుకు తగ్గట్టుగానే రేవంత్ సైతం అప్పుడే దూకుడుగా ఉండటం మొదలుపెట్టేశారు. ఇంకా పీసీసీ అధ్యక్షుడుగా ప్రమాణస్వీకారం చేయకముందే తన టార్గెట్‌ని ఫిక్స్ చేసేసుకున్నారు. మొన్నటివరకు అయితే రేవంత్ టార్గెట్ టీఆర్ఎస్ మాత్రమే. కానీ ఇప్పుడు బీజేపీ కూడా రేసులోకి రావడంతో రేవంత్ అటు టీఆర్ఎస్-ఇటు బీజేపీల లక్ష్యంగా రాజకీయం చేయాలి. అంటే కత్తికి రెండువైపులా పదును పెట్టుకుని రేవంత్ రాజకీయ యుద్ధం చేయాలి.

అందుకే రేవంత్ ఓ వైపు అధికార టీఆర్ఎస్‌ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తూనే బీజేపీపై కూడా ఫైర్ అవుతున్నారు. టీఆర్ఎస్-బీజేపీలు ఒకటే అని విధంగా రేవంత్ ప్రచారం చేస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి తెలంగాణని విముక్తి చేయాలని చెబుతూనే, అసలు బీజేపీలోకి తెలంగాణలో అంత సీన్ లేదని చెబుతున్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ కంటే కాంగ్రెస్‌ పార్టీ బలంగా ఉందని, ఎంఐఎం బలమెంతో బీజేపీదీ అంతేనని మాట్లాడుతున్నారు.

అలాగే జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల్లో కారు పోతే కారు, బండి పోతే బండి ఇస్తామని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అబద్దాలు చెప్పి మరీ బీజేపీకి 47 కార్పొరేటర్లు వచ్చేలా చేసుకున్నారని, కానీ గెలిచాక బండి లేదు గుండు లేదని అన్నారు. అంటే బండి సంజయ్, అరవింద్‌లు లక్ష్యంగా రేవంత్ విమర్శలు చేశారు. అటు కాంగ్రెస్‌ను బలహీనపరచి షర్మిల పార్టీని బలోపేతం చేయడానికే వైఎస్‌ను టీఆర్‌ఎస్‌ టార్గెట్‌ చేసిందని చెప్పి, షర్మిలని కూడా రేవంత్ టార్గెట్ చేశారు. మొత్తం మీద చూసుకుంటే రేవంత్ రెడ్డి టార్గెట్ మాత్రం టీఆర్ఎస్‌ని గద్దె దింపడం, బీజేపీ బలం తగ్గించడమనే చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version