తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బలహీన పడిన పార్టీని బలోపేతం చేయడానికి పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అటు సీనియర్ నేతలని ఏకతాటిపైకి తీసుకొచ్చే కార్యక్రమాన్ని ఇంచార్జ్ మాణిక్ రావు తీసుకున్నారు. దీంతో పార్టీలో అంతర్గత పోరు నిదానంగా సర్దుకుంటుంది. ఇదే క్రమంలో రేవంత్ పార్టీ బలోపేతం దిశగా ముందుకెళుతున్నారు.
ఓ వైపు కేసిఆర్ ప్రభుత్వాన్ని గట్టిగా టార్గెట్ చేసి విమర్శిస్తూనే..కాంగ్రెస్ పార్టీకి ప్రజా మద్ధతు పెరిగేలా చేయడానికి సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. ఓ వ్యూహం ప్రకారం పాదయాత్రలో రేవంత్ స్పీచ్‌లు ఉంటున్నాయి. ఓట్లు పొందడానికి సరికొత్తగా ముందుకెళుతున్నారు. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ళు ఉన్న వూరిలో తాము ఓట్లు అడుగుతామని, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఉన్న వూరిలో బిఆర్‌ఎస్ ఓట్లు అడగాలని సవాల్ చేశారు. అంటే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కంటే ఇందిరమ్మ ఇళ్లే ఎక్కువ ఉన్నాయని, ఆ ఘనత కాంగ్రెస్ పార్టీదే అని రేవంత్ చెప్పడానికి చూస్తున్నారు.
అలాగే 60 ఏళ్ల తెలంగాణ కలని సాకారం చేసిన కాంగ్రెస్‌ని ఎందుకు ఓడించారని రేవంత్ ఆవేదనతో మాట్లాడుతున్నారు. ఇందిరమ్మ ఇళ్లు, ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, రుణమాఫీ వంటి పథకాలు తేవడం కాంగ్రెస్ తప్పా, తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహమా అని నిలదీశారు. తాను రాబోయే పదవుల గురించి మాట్లాడడం లేదని, ఆవేదనతో అడుగుతున్నానని, తాగడానికి మంచి నీళ్లు ఇస్తేనే గుర్తుంచుకునే తెలంగాణ ప్రజలు.. రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాగాంధీని, కాంగ్రెస్‌ని ఎందుకు మరిచిపోయారని ఓ సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించారు.
అయితే రేవంత్ మాటలు పూర్తిగా తెలంగాణ ప్రజలని ఆలోచనలో పడేసేలా ఉన్నాయని చెప్పవచ్చు. ఇదే అంశం ఇంకా హైలైట్ అయితే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.