ప్రగతి భవన్ పై బీఎస్పీ జెండాను ఎగరవేయడం ఖాయం- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

రాష్ట్రంలో నిరుద్యోగులు సమస్యలు తీరాలన్నా.. రైతు రాజ్యం రావాలన్నా.. సంక్షేమ ఫలాలు అందాలన్నా.. బీఎస్పీ జెండా పట్టుకోవాలని బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్, మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. రాబోయే రోజుల్లో బహుజన, దళిత, గిరిజన శక్తులు ఏకమై ప్రగతి భవన్ పై బీఎస్పీ జెండా ఎగరవేయడం ఖాయమని అయన పునరుద్ఘాటించారు. కులాల, మతాలకు సమానం చూసేది బీఎస్పీనే అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఆయన  పర్యటించాడు.

 ప్రతీ కార్యకర్త ఓ సైనికుడిలా పోరాడి బీఎస్పీని అధికారంలోకి తీసుకురావాలని కోరాడు. బతుకులు మారాలంటే బహుజనుల రాజ్యం రావాలని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో కోదాడ, సూర్యాపేట, హుజూర్​నగర్​, తుంగతుర్తి నియోజకవర్గాల్లో నీలి జెండా ఎగిరేసేది ఖాయమని అన్నారు. దీన్ని ఎవరూ కూడా, ఏ శక్తి కూడా ఆపలేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో బహుజన రాజ్యం స్థాపిస్తామనే నమ్మకం నాకుందని అన్నారు. ఈ పర్యటనలో బీఎస్పీ కార్యకర్తలకు దిశానిర్ధేశం చేశారు ప్రవీణ్ కుమార్.