రోజు రోజుకు రూపాయి మారకం విలువ పడిపోతోంది. అయితే.. తాజాగా.. అమెరికా డాలర్‌పై రూపాయి మారకం విలువ నిలబడలేనంటున్నది. అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ బలోపేతం కావడంతో సోమవారం ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి 31 పైసలు నష్టపోయి రూ.82.78 వద్ద ముగిసింది. ట్రేడింగ్ ప్రారంభంలో రూ.82.35 వద్ద మొదలైన రూపాయి.. ఇంట్రా డే ట్రేడింగ్‌లో రూ.82.32 ఆల్‌టైం గరిష్ట స్థాయికి దూసుకెళ్లి తిరిగి రూ.82.80 కనిష్ట స్థాయికి పతనమైంది. ఈ నెలలో పదోసారి రూపాయి పతనమైంది. 1985 తర్వాత రికార్డు స్థాయిలో ఒక నెలలో రూపాయి విలువ పడిపోవడం ఇదే తొలిసారి.
సోమవారం ముగింపు సమయంలో డాలర్‌పై రూపాయి రూ.82.78 వద్ద స్థిర పడింది. ఇంతకుముందు సెషన్‌లో రూపాయి 82.47 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు బలహీనంగా ఉండటంతోపాటు దేశీయ ఈక్విటీ మార్కెట్లలో పాజిటివ్ ధోరణి నెలకొందని బీఎన్పీ పారిబాస్ రీసెర్చ్ అనలిస్ట్ అనూజ్ చౌదరి చెప్పారు. ఈక్విటీ మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు పెట్టడంతో దిగువకు పడిపోయిన రూపాయి విలువకు మద్దతు లభించింది.
డాలర్ ఇండెక్స్‌లో ఆరు కరెన్సీల బాస్కెట్‌లో అమెరికా డాలర్ 0.28 శాతం బలోపేతమై 111.05 డాలర్లుగా నమోదైంది. గ్లోబల్ ఆయిల్ బెంచ్‌మార్క్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌పై 0.93 శాతం పతనమై 94.88 డాలర్లకు చేరుకున్నది. దేశీయ స్టాక్ మార్కెట్లలో బీఎస్ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్ 786.74 పాయింట్లు (1.31 శాతం) బలోపేతమై 60,746.59 పాయింట్ల వద్ద స్థిర పడింది. మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ 225.40 పాయింట్లు (1.27 శాతం) పెరిగి 18,012.20 పాయింట్ల వద్ద ముగిసింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో రూ.1,568.75 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.