ఒకే ఓవర్‌లో 6 6 6 6 4 6.. అదరగొట్టిన జింబాబ్వే బ్యాటర్​

-

బంగ్లాదేశ్‌లో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో జింబాబ్వే బ్యాటర్‌ ర్యాన్‌ బర్ల్‌ సెన్సేషనల్‌ బ్యాటింగ్​తో అదరగొట్టేశాడు. ఒకే ఓవర్‌లో ఐదు సిక్సులు సహా ఓ ఫోర్‌తో మొత్తంగా 34 పరుగులు సాధించాడు. స్పిన్నర్‌ నసుమ్‌ అహ్మద్‌ వేసిన 15వ ఓవర్‌లో బర్ల్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.


మొదటి నాలుగు బంతులను సిక్సులుగా మలిచిన ర్యాన్‌.. ఆ తర్వాతి బంతికి ఫోర్‌ సాధించాడు. తర్వాతి బంతికి ఏమవుతుందా అని ప్రేక్షకులంతా ఉత్కంఠగా ఎదుచూస్తుండగా.. ఆరో బంతిని సైతం ప్రేక్షకుల మధ్యలోకి పంపాడు. దీంతో ఒకే ఓవర్‌లో 34 పరుగులు సాధించి అరుదైన జాబితాలో చోటు దక్కించుకున్నాడు.

జింబాబ్వే బ్యాటర్​ ర్యాన్​ బర్ల్​అంతకంటే ముందు భారత ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ ఆరు బంతులకు ఆరు సిక్సులు బాదిన విషయం తెలిసిందే. ఆపై విండీస్‌ వీరుడు కీరన్‌ పొలార్డ్‌ సైతం శ్రీలంక బౌలర్‌ అకిల ధనంజయపై విరుచుకుపడి 36 పరుగులు రాబట్టాడు. న్యూజిలాండ్‌ క్రికెటర్‌ టిమ్‌ సైఫర్ట్‌, భారత యువ ఆటగాడు శివమ్‌ దూబే 34 పరుగులు సాధించగా.. తాజాగా ర్యాన్‌ బర్ల్‌ ఆ జాబితాలో చేరాడు.

స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను జింబాబ్వే 2-1తేడాతో కైవసం చేసుకుంది. మొదటి రెండు మ్యాచ్‌ల్లో చెరో జట్టు గెలుపొందగా.. నిర్ణయాత్మక మూడో మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు 10 పరుగుల తేడాతో విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వే 67 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉండగా.. బర్ల్‌ (28 బంతులకు 54), న్యూచీ (20 బంతుల్లో 35) విజృంభించడంతో జట్టు స్కోరు 156కు చేరింది. ఆపై ఛేదనకు దిగిన బంగ్లా 146 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version