తెలంగాణ రైతులకు కేసీఆర్ సర్కార్ శుభవార్త చెప్పింది. యాసంగి పెట్టుబడి సాయంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 28 నుంచి రైతులకు రైతుబంధు నిధులు పంపిణీ చేయనున్నది. దాంతోపాటు కొత్త లబ్ధిదారుల నమోదుకు అనుమతి ఇచ్చింది. ఈ నెల 5 వరకు రిజిస్ట్రేషన్ పూర్తయి, పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ అయిన భూములకు పెట్టుబడి సాయం అందజేయనున్నది.
కొత్తగా యాజమాన్య హకులు పొందిన రైతులు పట్టాదారు పాస్‌పుస్తకం, ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలను ఏఈవోకు ఇవ్వాలని అధికారులు సూచించారు. ప్రభుత్వం గత ఏడాది వానాకాలం సీజన్లో కొత్త లబ్ధిదారుల నమోదుకు జూన్ 10 కటాఫ్‌గా నిర్ణయించింది. దాదాపు ఏడాది తర్వాత ఇప్పుడు మళ్లీ జాబితాలో మార్పులు, చేర్పులు జరుగనున్నాయి.
ఈ మేరకు 2021 జూన్ 10 నుంచి ఈ ఏడాది జూన్ 5 వరకు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లలో జరిగిన మార్పులు, చేర్పుల డాటాను సీసీఎల్‌ఏ తాజాగా వ్యవసాయ శాఖకు అందజేసింది. ఈ మేరకు ఏఈవోలు కొత్త ఎంట్రీలు చేయనున్నారు. ఓవైపు రైతుబంధు నిధుల పంపిణీ జరుగుతూనే, మరోవైపు నూతన లబ్ధిదారుల నమోదు ప్రక్రియ కొనసాగుతున్నదని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యవసాయ కమిషనరేట్ వర్గాలు తెలిపాయి. గత యాసంగిలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 63 లక్షల మంది రైతులకు రూ.7,411 కోట్లను రైతుల ఖాతాల్లో వేశారు. నూతన లబ్ధిదారుల నమోదుతో ఈసారి సంఖ్య పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు పేర్కొంటున్నారు.