తెలంగాణ ఆర్టీసీ, తపాలా, ఐటీ శాఖల సహకారంతో డోర్ డెలివరీ చేసేవిధంగా ఏర్పాట్లు చేసింది దేవాదాయ శాఖ. ఫిబ్రవరి 12 నుంచి 22 వరకు ఆన్‌లైన్‌లో ఇంటికే ప్రసాదం సేవలు అందుబాటులోకి రానున్నట్టు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వెల్లడించారు. ములుగు జిల్లాలోని మేడారం సమ్మక్క, సారలమ్మ ప్రసాదంను ఆర్టీసీ తపాలా శాఖల ద్వారా భక్తుల ఇండ్ల వద్దకు చేర్చనున్నట్టు తెలిపారు.
అమ్మవారి ప్రసాదంను డోర్ డెలివరీ చేసేందుకు ఇండియన్ పోస్టల్, ఆర్టీసీ, ఐటీ శాఖల సేవలను వినియోగించుకోనున్నట్టు ఆయన తెలిపారు. అమ్మవారి ప్రసాదం నేరుగా పొందలేని వారికి భారత పోస్టల్ సర్వీస్, కొరియర్ సర్వీస్ ద్వారా తమ ఇంటికే చేరవేసే విధంగా ఏర్పాట్లను చేసినట్టు చెప్పారు. భక్తులు ఆర్డర్ మేరకు ఇంటి నుంచే బెల్లం, బంగారం ప్రసాదం అమ్మవారికి సమర్పించే వారి కోసం కూడా ఆర్టీసీ సంస్థ భక్తుల ఇంటికి వచ్చి ప్రసాదాన్ని తీసుకుని వెళ్లి అమ్మవారికి సమర్పించి మళ్లీ దానిని భక్తులకు అందజేయనున్నట్టు వెల్లడించారు. 200 గ్రాముల బెల్లం ప్రసాదం, పసుపు, కుంకుమ, అమ్మవారి ఫొటోను భక్తులకు ఇంటివద్దకు అంజేస్తాం అని చెప్పారు. ఫిబ్రవరి 12 నుంచి 22 వరకు ఆన్‌లైన్‌లో ఇంటికే ప్రసాదం సేవలను వినియోగించుకోవాలని దేవాదాయ శాఖ మంత్రి సూచించారు.