నేటి నుంచి బడి గంట మోగనున్నది. విద్యార్థులు బడిబాటపట్టనున్నారు. నిన్నటి వరకు వేసవి సెలవుల ఒడిలో సేదతీరిన చిన్నారులు చదువుల తల్లి ఒడిలోకి చేరుతున్నారు. అందుకు తగ్గట్టుగానే అన్ని పాఠశాలల యాజమాన్యాలు ఏర్పాట్లు పూర్తి చేశాయి. ముఖ్యంగా కరోనా జాగ్రత్తలు పకడ్బందీగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నాయి. మరోవైపు విద్యార్థులను క్షేమంగా తరలించే స్కూల్ బస్సుల విషయంలో ఆర్టీఏ ప్రత్యేక ఫోకస్ పెట్టింది.
గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల రవాణా శాఖ పరిధిలో 11,842 విద్యాసంస్థల బస్సులు ఉన్నాయి. నిబంధనలు పాటించనిచో బస్సులను సీజ్ చేస్తామని అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే స్కూల్ యాజమాన్యాలకు నోటీసులు పంపించారు. రాష్ట్రంలో వేసవి సెలవుల అనంతరం తొలుత నిర్ణయించిన ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో 2022-23 ఏడాది నుంచి ఒకేసారి ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో బోధన జరగనుంది.