తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి సొంత పార్టీ నుంచే షాకులు తగులుతాయా? కాంగ్రెస్ నాయకులు పూర్తిగా రేవంత్‌కు సహకారం అందించడం లేదా? అంటే ప్రస్తుతానికైతే ఏది చెప్పలేని పరిస్తితి ఉందనే చెప్పొచ్చు. ఎందుకంటే రేవంత్‌కు పీసీసీ రాగానే, చాలామంది సీనియర్లు వ్యతిరేకించారు. అయితే నిదానంగా రేవంత్ రెడ్డి, అందరినీ తన దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేశారు. ఇక నాయకులు కూడా రేవంత్ బాటలోకి వచ్చినట్లే కనిపిస్తున్నారు. కానీ అది పైకి మాత్రమే అని, లోపల మాత్రం వారు అసంతృప్తిగానే ఉన్నారని తెలుస్తోంది.
కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది కాబట్టి, తప్పదని చెప్పి రేవంత్‌కు సహకారం అందిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే రాష్ట్రంలో ఉన్న అన్నీ నియోజకవర్గాల్లో రేవంత్ మాట చెలామణి కావడం కష్టమని తెలుస్తోంది. ఏ జిల్లాకు ఆ జిల్లాలో కాంగ్రెస్‌లో పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. వారిని బట్టే అక్కడ రాజకీయాలు నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పైగా రాష్ట్రంలో ఉన్న నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు అందరూ రేవంత్ మాట వినే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఏదో కొందరు మాత్రమే రేవంత్ మాట వింటారుగానీ, మిగతవారు రేవంత్‌ని లెక్కచేయరని తెలుస్తోంది. అక్కడ ఉండే సీనియర్ నాయకులని బట్టి ముందుకెళ్లే ఛాన్స్ కనిపిస్తోంది. అలాంటప్పుడు రేవంత్ రెడ్డి వ్యూహాలు గానీ, ఆయన నిర్ణయాలు గానీ అనుకున్న మేర చెల్లుబాటు కావు.
ఈ పరిస్తితులు రేవంత్ రెడ్డికి ఇబ్బందికరంగానే ఉంటాయని, దాని వల్ల పార్టీకి మళ్ళీ నష్టం జరిగే ఛాన్స్ కూడా కనిపిస్తోంది. పైగా వచ్చే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో కాంగ్రెస్ నాయకులు, రేవంత్ మాట మీద నడవటం కష్టమని తెలుస్తోంది. అసలు కాంగ్రెస్ నాయకులు ఏకతాటిపైకి వచ్చి అభ్యర్ధులని ఎంపిక చేయలేరు. ఇక ఈ అంశాలన్నీ కాంగ్రెస్ పార్టీకి మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.