రన్నింగ్‌ ట్రైన్‌లో పాము.. ప్రయాణికులు అరుపులు, కేకలు

-

భారీ వర్షాల నేపథ్యంలో కీటకాలు, పాములు కలుగు నుంచి బయటకు వచ్చి జన సంచారాల్లో వస్తున్నాయి. అయితే దీంతో వీటిని చూసిన జనాలు భయాందోళనకు గురవుతున్నారు. అంతేకాకుండా పలు చోట్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే తాజాగా.. తిరువనంతపురం నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలులో పాము కనిపించడంతో ప్రయాణికులు భయంతో అరుపులు కేకలు వేశారు. దీంతో రైలును ఆపేశారు. పామును పట్టుకునేందుకు రైలును దాదాపు గంటపాటు నిలిపివేశారు. కేరళలోని కోజికోడ్ స్టేషన్‌లో జరిగింది. రైలు తిరూర్ నుంచి బయలుదేరిన కాసేపటికే ఎస్ 5 బోగీలో బెర్త్ కింద లగేజీ మధ్యలో పాము కనిపించడంతో ప్రయాణికులు హడలిపోయారు. వెంటనే ఆ విషయాన్ని టీసీ దృష్టికి తీసుకెళ్లారు.

ఆయన అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు తర్వాతి స్టేషన్ అయిన కోజికోడ్‌లో రైలును నిలిపివేశారు. స్టేషన్‌లో రైలు ఆగగానే ప్రయాణికులు కిందికి దిగిపోయారు. పాములు పట్టే వారితో బోగీని వెతికించారు. గంటపాటు వెతికినా దాని జాడ కనిపించకపోవడంతో అది బయటకు వెళ్లిపోయి ఉంటుందని నిర్ధారించారు. కొందరు ప్రయాణికులు తమ ఫోన్లలో తీసిన పాము ఫొటోలను పరిశీలించి అది విషపూరిత సర్పం కాదన్న నిర్ణయానికి వచ్చారు. పాము ఓ రంధ్రం గుండా బయటకు వెళ్లిపోయి ఉండొచ్చిన భావించిన దానిని మూసివేశారు అధికారులు. దీంతో.. అనంతరం రైలు తిరిగి బయలుదేరింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version