ఏపీలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటలయుద్ధం నడుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ ఈ మాటలయుద్ధం తారాస్థాయికి చేరుతోంది. అయితే.. ఇవాళ టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. వై ఏపీ నీడ్స్ జగన్ (రాష్ట్రానికి జగన్ ఎందుకు కావాలి) అంటూ వైసీపీ నేతలు ప్రచారం చేసుకుంటుండడం పట్ల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్, అరాచక ఆంధ్రప్రదేశ్ గా మార్చినందుకు మరలా జగన్ కావాలా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలు భారత దేశ పౌరుల్లా జీవించేందుకు అవసరమైన హక్కులకోసం పోరాడే దుర్గతి కల్పించాడు ఈ ముఖ్యమంత్రి అని మండిపడ్డారు.
మీ బిడ్డను… మీ అన్నను… మీ తమ్ముడిని… రాష్ట్రానికి నా అవసరం ఉంది అని జగన్ చెప్పుకుంటున్నాడే తప్ప ప్రజలు చెప్పడంలేదని స్పష్టం చేశారు. తాను పేదల పక్కన ఉన్నానని జగన్ చెప్పుకుంటున్నాడు… వాస్తవానికి ఆయన పక్కన ఉంది వేల కోట్లతో లిక్కర్, ఇసుక వ్యాపారం చేసేవారు, వేలకోట్ల విలువైన కాంట్రాక్టులు కొట్టేసే కాంట్రాక్టర్లు, అదానీలు, పరిమల్ నత్వానీలు అని సోమిరెడ్డి విమర్శించారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు జగన్ పక్కన ఉన్నారనేనా… అధికారంలోకి వచ్చీరాగానే టీడీపీ ప్రభుత్వం వారి సంక్షేమం కోసం ఏర్పాటుచేసిన కార్పొరేషన్లు, పథకాలు అన్నీ రద్దు చేశాడు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
“విజయవాడలో జరిగిన వైసీపీ జనరల్ బాడీ సమావేశంలో వై ఏపీ నీడ్స్ జగన్ (ఆంధ్ర రాష్ట్రానికి జగన్ ఎందుకు కావాలి) అనే దానిపై జగన్మోహన్ రెడ్డి చాలా చెప్పుకొచ్చారు. పేదలు ఒక పక్క.. పెత్తందారులు ఒకపక్క ఉన్నారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల్లోని పేదలకు తానే ప్రతినిధినని ఆయన చెప్పుకున్నారు.