ఏపీలో పొత్తుల రాజకీయం హాట్ టాపిక్‌గా మారింది. అయితే నిన్న జనసేనాని పవన్ చేసిన వ్యాఖ్యాలు బీజేపీలో చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో బీజేపీ, జనసేన కలిసి ముందుకు అడుగులు వేస్తాయని, మెట్టు ఎవరు ఎక్కుతారో, ఎవరు దిగుతారో త్వరలోనే తెలుస్తుందని ఏపీ బీజపీ చీఫ్ సోము వీర్రాజు అన్నారు. విజయవాడలో రేపు ఆ పార్టీ జాతీయ చీఫ్ జేపీ నడ్డా నిర్వహించే సభా ప్రాంగణ ఏర్పాట్లను నిన్న పరిశీలించిన వీర్రాజు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
పవన్ కల్యాణ్ ఇచ్చిన మూడు ఆప్షన్లలో మొదటి దానిని తామే పరిగణనలోకి తీసుకుంటామని, రెండో ఆప్షన్ గురించి టీడీపీనే అడగాలని మీడియాకు సూచించారు. పవన్ వ్యాఖ్యలను తాము స్వాగతిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఉందని, ఆత్మకూరు ఉప ఎన్నిక ద్వారా దీనికి సమాధానం చెబుతామని అన్నారు. కుటుంబ రాజకీయాలకు ఫుల్‌స్టాప్ పెట్టడమే తమ లక్ష్యమని అన్నారు. వైసీపీ తీరును అందరూ తప్పుబడుతున్నారని, అందుకనే తాము ఆత్మకూరు బరిలో దిగినట్టు వివరణ ఇచ్చారు. ప్రజలు, ప్రతిపక్షాలు ఈ విషయాన్ని గమనించాలని సోము వీర్రాజు కోరారు.