కాంగ్రెస్‌ను, రాహుల్‌‌‌ను తిట్టిన పీకేతో సోనియా భేటీ? అసలు ఏం జరుగుతోంది..?

-

‘‘గత పదేళ్లలో కాంగ్రెస్ పార్టీ 90 శాతానికిపైగా ఎన్నికల్లో ఓడిపోయింది. పార్టీ నాయకత్వం ఓ వ్యక్తి దైవిక హక్కు కాదు. ప్రతిపక్ష నాయకత్వాన్ని ప్రజాస్వామ్యయుతంగా నిర్ణయించుకుందాం’’ గత ఏడాది పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ లక్ష్యంగా ట్విట్టర్ వేదికగా తీవ్ర పదజాలంతో మండిపడి దుమారం రేకెత్తించిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.. తాజాగా అదే పార్టీ అగ్రనాయత్వంతో భేటీ కావడం పెను సంచలనంగా మారింది.

ఏకంగా తనపైనే విమర్శలు చేసిన వ్యక్తితో భేటీకి రాహుల్ గాంధీ ఎలా అంగీకరించాడు? తనపైనే సెటైర్లు వేసిన వ్యక్తి నుంచి ‘ఎన్నికల రోడ్ మ్యాప్’ ప్రెజెంటేషన్ తీసుకోవడం ఏమిటి? ఇదిప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ప్రశాంత్ కిశోర్‌తో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్‌, అంబికా సోనీ, అజయ్ మాకేన్ తదితరులు కీలక చర్చలు జరిపిన విషయం తెలిసిందే. 2024 లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ భేటీలో చర్చించామని, ప్రశాంత్ కిశోర్ ఓ ప్రెజెంటేషన్ ఇచ్చారని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి.

దీని వెనుక పెద్ద కథే ఉందని అంటున్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న గుజరాత్‌లోని ఓ బలమైన కమ్యూనిటీకి చెందిన నేత ఒత్తిడి వల్లే జరిగిందని, ఆ నేతపై ఉన్న భరోసాతోనే రాహుల్ గాంధీ కూడా ఈ సమావేశానికి ఒప్పుకున్నారని అంటున్నారు. 2015లో గుజరాత్‌లో ఉవ్వెత్తున ఎగిసిపడిన పాటీదార్ ఆందోళన గురించి తెలిసిందే. పాటీదార్ అనామత్ ఆందోళన్ సమితి పేరిట తమ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని ఉద్యమం మొదలుపెట్టిన హార్దిక్ పటేల్ రాష్ర్టంలో ప్రముఖ నేతగా ఎదిగారు. ఈ క్రమంలో 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరారు. 2020లో వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు.

నిజానికి పాటీదార్ ఆందోళనల నేపథ్యంలో నే 2017లో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 77 సీట్లను గెల్చుకోగలిగింది. అంతకుముందు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సత్తా చాటింది. అయితే.. పార్టీలో తనకు ప్రాధాన్యం దక్కడంలేదని, అధిష్ఠానం తనను అవమానిస్తోందని వారం క్రితం ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హార్దిక్ పటేల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

తనను పార్టీలో అసలు పట్టించుకోవడం లేదని, సమావేశాలకు పిలవడం ఆక్రోశం వెళ్లగక్కారు. ముఖ్యంగా ఖోడల్దామ్ ట్రస్ట్ అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త, అత్యంత బలమైన పాటీదార్ నాయకుడు నరేశ్ పటేల్‌ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెబుతున్నా నాన్చుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజానికి హార్దిక్ పటేల్‌తో పోలిస్తే నరేశ్ పటేల్(56) అత్యంత బలమైన పాటిదార్ నేత. పాటిదార్లలోని లెనువా వర్గానికి చెందినవారు. గుజరాత్‌ అసెంబ్లీలో మొత్తం182 స్థానాలు ఉండగా.. అందులో 48 సౌరాష్ర్ట ప్రాంతంలో ఉన్నాయి. ఇందులో 40 సీట్లలో నరేశ్ పటేల్ తన ప్రభావాన్ని చూపించగలరు. ఒంటిచేత్తో పార్టీని గెలిపించే సత్తా ఉంది.

rahul gandhi

నరేశ్ పటేల్ చేరికపై పార్టీలో కొద్ది కాలంగా చర్చ జరుగుతూనే ఉంది. ఆయన్ను పార్టీలో చేర్చుకోవాలని కొందరు కీలక నేతలు తవ్ర ఒత్తిడి చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా నరేశ్ పటేల్ పెట్టిన కొన్ని కండీషన్లే అధిష్ఠానానికి ఇరకాటంగా మారాయి. ఆ కండీషన్లలో అత్యంత ముఖ్యమైనది వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌కు పార్టీ వ్యూహ, ప్రచార బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేయడం. అలా చేస్తేనే తాను కాంగ్రెస్‌లో చేరుతానని తెగేసి చెప్పారు. కానీ కాంగ్రెస్‌పైనా, రాహుల్ గాంధీపైనా పరోక్షంగా విమర్శలు చేసిన వ్యక్తికి గుజరాత్ బాధ్యతలు అప్పగించడంపై అధిష్ఠానం తర్జనభర్జన పడింది. ఈ అంశాన్ని పక్కన పెట్టింది. కానీ..ఇటీవల జరిగిన ఐదు రాష్ర్టాల ఎన్నికల్లో కోలుకోలేని రీతిలో ఓటమి ఎదురవడంతో ఏమి చేయాలో పాలుపోని స్థితిలో ప్రశాంత్ కిశోర్ తో భేటీకి కాంగ్రెస్ నాయకత్వం ఒప్పుకుంది.

మరింత కష్టపడితే గుజరాత్ లో గెలుపు తీరానికి చేరే అవకాశమున్నందున అధిష్ఠానమే తగ్గింది. బీజేపీకి అత్యంత బలమైన పోటీ ఇచ్చే నేతను వదులుకోలేక ఇందుకు అంగీకరించిందని, పంతాలు పట్టింపులకు పోతే అసలుకే ప్రమాదమని గుర్తించిందని అంటున్నారు. ఈ చర్చలు ఫలప్రదమైతే గుజరాత్ ప్రచార వ్యూహం లేదా బాధ్యతలు పీకేకు అప్పగిస్తారని, అక్కడకనుక కాంగ్రెస్ విజయవంతమైతే ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల్లో ఆయన వ్యూహాలు అమలులోకి వస్తాయని అంటున్నారు. కాగా.. నరేశ్ పటేల్ కాంగ్రెస్ లోకి వస్తే హార్దిక్ పటేల్ కు మరింత పోటీ ఎదురవడం ఖాయం.

ఆయన ‘సీఎం’ ఆశలకు గండిపడ్డట్లే. అందుకే నరేశ్ పటేల్ రాకను పరోక్షంగా వ్యతిరేకిస్తున్న హార్దిక్ పటేల్ కాంగ్రెస్ పెద్దల తీరుపై బహిరంగంగా విమర్శలు చేయడం ప్రారంభించారని అంటున్నారు. ఒకవేళ నరేశ్ పటేల్ గనుక కాంగ్రెస్ లో చేరితే… హార్దిక్ పటేల్ కాంగ్రెస్‌ను వీడి ‘ఆప్’లో చేరడం ఖాయమని కూడా అంటున్నారు. ఇప్పటికే తమ పార్టీలో చేరాలని హార్ధిక్ పటేల్ ను ఆప్ ఆహ్వానించింది కూడా. మొత్తంగా చూస్తే త్వరలోనే గుజరాత్ రాజకీయాలు మరింత రంజుగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news