యూపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాజకీయం రసవత్తంగా మారుతోంది. తొలుత సమాజ్ వాదీ పార్టీ( ఎస్పీ) వలసల గేమ్ స్టార్ట్ చేస్తే.. దాన్ని బీజేపీ అందిపుచ్చుకుని ఎస్పీ పార్టీకే షాక్ ఇస్తోంది. ఇటీవల ముగ్గురు బీజేపీ ప్రభుత్వ క్యాబినెట్ మంత్రులతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు బీజేపీ నుంచి సమాజ్ వాదీ పార్టీలో చేరారు. ఇదిలా ఉంటే బీజేపీ ఏకంగా ఎస్పీ అధినేత ములాయం సింగ్ కోడల్ని చేర్చుకుని ఎస్పీకి భారీ షాక్ ఇచ్చింది.
ఇదిలా ఉంటే ఎస్పీ పార్టీకి మరో షాక్ తగిలింది. మాజీ మంత్రి, ఎస్పీ నాయకుడు శివచరణ్ ప్రజాపతి లక్నోలో బీజేపీలో చేరారు. ఆయనతో పాటు పలువురు బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బరేలీకి చెందిన ట్రిపుల్ తలాక్ బాధితురాలు నిదా ఖాన్ కూడా బీజేపీలో చేరారు. త్రిపుల్ తలాక్ చట్టం తీసుకువచ్చినందుకు, మహిళా సాధికారత కోసం పనిచేస్తున్నందుకు బీజేపీలో చేరానని నిదాఖాన్ తెలిపారు.