కోవిడ్ కారణంగా మనుషులంతా ఒకరికొకరు దూరమయ్యారు. భౌతిక దూరం పాటించడం, కొత్తవారిని కలవకపోవడం సహా బంధువుల ఇళ్ళకి కూడా వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. ఆఖరుకి దేవుడి గుడిలో ప్రశాంతంగా ఉందామనుకున్నా కూడా అది కూడా సాధ్యం కాలేదు. కరోనా ధాటికి దేవాలయాలన్నీ మూతపడ్డాయి. దాంతో దేవుడి దర్శనం లేకుండా పోయింది. ఐతే ప్రస్తుతం కోవిడ్ పరిస్థితులు మెల్ల మెల్లగా తగ్గుతున్నాయి. కేసులు తగ్గుతుండడంతో దేవాలయాలు ఒక్కొక్కటిగా తెరుచుకుంటున్నాయి.
భక్తుల సందర్శనార్థం దేవాలయ తలుపులు తెరుచుకోబోతున్నాయి. అందులో భాగంగా శ్రీశైలం దేవాలయం తెరుచుకుంది. ఐతే ఇక్కడ రేపటి నుండి స్పర్శ దర్శనం ప్రారంభం కాబోతుంది. దీని ప్రకారం గర్భాలయంలోకి భక్తులకు ప్రవేశం ఉంటుంది. కోవిడ్ కారణంగా మార్చి 2020లో స్పర్శ దర్శనాన్ని నిలిపి వేసారు. స్పర్శ దర్శనం దశల వారీగా మొదలు కానుంది. అలాగే విడతల వారీగా అభిషేకాలు కూడా జరగనున్నాయి.